CM Stalin: తమిళనాడు మత్స్యకారుల బోట్లను వేలం వేస్తున్న శ్రీలంక... ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం స్టాలిన్

  • శ్రీలంక అదుపులో తమిళనాడు జాలర్ల బోట్లు
  • 105 బోట్లను వేలం వేసేందుకు లంక ఏర్పాట్లు
  • లంకపై ఒత్తిడి తేవాలన్న సీఎం స్టాలిన్
  • బోట్లను విడిపించాలని విజ్ఞప్తి
Tamilnadu CM Stalin wrotePM Narendra Modi

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తమిళనాడు మత్స్యకారులకు చెందిన బోట్లను శ్రీలంక ప్రభుత్వం వేలం వేస్తోందని, దీన్ని భారత ప్రభుత్వం అడ్డుకోవాలని కోరారు. తమిళనాడు మత్స్యకారులకు చెందిన 105 బోట్లు శ్రీలంక ప్రభుత్వం అధీనంలో ఉన్నాయని, వాటిని ఫిబ్రవరి 7 నుంచి 11వ తేదీ వరకు వేలం వేసేందుకు శ్రీలంక మత్స్య, జలవనరుల శాఖ సన్నాహాలు చేస్తోందని స్టాలిన్ తన లేఖలో వివరించారు.

ఇరుదేశాల మత్స్యశాఖలు త్వరలోనే సమావేశం కానున్న తరుణంలో ఈ దురదృష్టకర పరిణామం తెరపైకి వచ్చిందని, దీర్ఘకాలంగా సమస్యాత్మకంగా ఉన్న ఈ అంశం పట్ల తమిళనాడు మత్స్యకారుల్లో మరింత అపోహలు ఏర్పడుతున్నాయని, దీనికి సరైన పరిష్కారం ఆలోచించాలని సూచించారు.

మరోవైపు శ్రీలంక ప్రభుత్వం ఎలాంటి సంప్రదింపులు లేకుండానే బోట్లను వేలం వేసేందుకు పత్రికా ప్రకటనలు ఇస్తోందని సీఎం స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బోట్లను కోల్పోతే పేద మత్స్యకారుల జీవితాలు మరింత దుర్భరం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బోట్లను విడుదల చేయాలని శ్రీలంక న్యాయస్థానాలు కూడా ఆదేశాలు ఇచ్చాయన్న విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు.

ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని శ్రీలంక నిర్ణయంపై భారత కేంద్రం ప్రభుత్వం తన అసంతృప్తిని బలంగా వ్యక్తపరచాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. బోట్ల వేలం కోసం పత్రికల్లో ఇచ్చిన ప్రకటన రద్దు చేసేలా ఒత్తిడి తేవాలని కోరారు. కోర్టులు విడుదల చేసిన బోట్లను ఎలా వేలం వేస్తారన్న అంశాన్ని శ్రీలంక సర్కారు దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించారు.

శ్రీలంక, తమిళనాడు మధ్య ఉన్న సముద్ర జలాల్లో చేపల వేటకు వెళ్లే తమిళనాడు మత్స్యకారుల బోట్లను శ్రీలంక నేవీ అడ్డుకోవడం తెలిసిందే. లంక బలగాలు ఇప్పటివరకు చాలా పర్యాయాలు తమిళనాడు జాలర్లను బోట్లతో సహా అదుపులోకి తీసుకున్నాయి.

More Telugu News