KL Rahul: కెప్టెన్ గా మెరుగవుతా.. కొత్త జట్టును సమర్థంగా నడిపిస్తా: కేఎల్ రాహుల్

  • కెప్టెన్సీ అనేది నిరంతరం మెరుగుపడే సాధనం
  • ప్రతీ మ్యాచ్ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు
  • పటిష్ఠ జట్టుగా లక్నో సూపర్ జెయింట్స్
  • దేశానికి గొప్ప క్రికెటర్లను అందిస్తాం
Captaincy is a thing you can only get better at

కెప్టెన్సీ విషయంలో మరింత మెరుగ్గా ఉండాలన్న విషయాన్ని భారత జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ అంగీకరించాడు. రోహిత్ శర్మ గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరంగా ఉండటంతో వన్డే సిరీస్ కు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించడం తెలిసిందే. మూడు మ్యాచుల్లోనూ ఓటమి పాలవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కేఎల్ రాహుల్ ఓ వార్తా సంస్థతో మాట్లాడిన సందర్భంగా పలు అంశాలపై స్పందించాడు.  

‘‘గడిచిన రెండు మూడేళ్లుగా కెప్టెన్ గా నేను తెలుసుకున్నది.. కెప్టెన్సీ అన్నది కచ్చితంగా మెరుగుపడే స్థానం. జట్టుకు కెప్టెన్ గా ఉన్నప్పుడే నేర్చుకోవచ్చు. నిజంగా ఆ అవకాశం వచ్చినప్పుడు పాత్ర వేరేలా ఉంటుంది. ప్రతీ ఆట కూడా ఒక అభ్యాసనే. నా కెరీర్ లేదా కెప్టెన్ బాధ్యతలను ముగించే వరకు ఈ అభ్యాసన ఆగిపోతుందని అనుకోవడం లేదు’’ అని రాహుల్ చెప్పాడు.

ఆట అన్న తర్వాత గెలుపు, ఓటములు ఉంటాయన్నాడు రాహుల్. కచ్చితంగా ప్రతీ మ్యాచుతో ఎంతో నేర్చుకోవచ్చని చెప్పాడు. "తటస్థంగా ఉండడం, ఆటగాడిగా, జట్టు కెప్టెన్ ఎంత మెరుగవుతున్నామన్నది ముఖ్యం. నేను అనుసరించే విధానం ఇదే’’ అని రాహుల్ పేర్కొన్నాడు. ఆటలో పొరపాట్లు సహజమేనని, మహా అయితే 10,20 మ్యాచులకు తప్పులను వాయిదా వేయవచ్చన్నాడు. కెప్టెన్ గా తాను నేర్చుకున్నది ఇదేనని చెప్పాడు.

ఇదిలావుంచితే, ఐపీల్ కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ గా రాహుల్ ను రూ.17 కోట్లకు డీల్ చేసుకుంది. దీంతో లక్నో, ఆర్పీఎస్జీ గ్రూపుతో కలసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నట్టు రాహుల్ తెలిపాడు. లక్నో సూపర్ జెయింట్స్ ను పటిష్ఠ జట్టుగా తీర్చిదిద్దుతామని చెప్పాడు.

‘‘విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్, సీఎస్కేను గమనిస్తే ఆర్ రౌండర్లతో ఉంటాయి. దీర్ఘకాలంగా వారి విజయానికి ఇదే కారణం. అటువంటి జట్టునే నిర్మించాలన్నది మా ఆలోచన’’ అని వివరించాడు. లక్నో సూపర్ జెయింట్స్ ద్వారా దేశానికి మంచి క్రికెటర్లను అందిస్తామన్నాడు.

More Telugu News