Omicron: కరోనాకు ‘ఒమిక్రాన్’ ముగింపు కార్డేనా?.. దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తల అధ్యయనం!

  • హెర్డ్ ఇమ్యూనిటీ కీలకం
  • వైరస్ బలహీనపడడం ముగింపు సూచకే
  • దక్షిణాఫ్రికా పరిశోధనలు చెబుతున్నదిదే
  • ఒమిక్రాన్ తో బలమైన రోగనిరోధకత
Is Omicron the end game of Covid19

కరోనా మహమ్మారి ఎప్పుడు అంతమైపోతుంది? ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే ప్రశ్న ఇది. వైరస్ కారణంగా వచ్చే విపత్తు ఎంతకాలమైనా కొనసాగొచ్చు. కానీ, హెర్డ్ ఇమ్యూనిటీ, ప్రమాదకర స్థితి నుంచి ప్రమాదం చేయని స్థాయికి వైరస్ బలహీనపడడం అన్నవి జరుగుతాయి. ఈ రెండూ ఆచరణలో కనిపిస్తే ఆ మహమ్మారి గండం తప్పినట్టుగా పరిగణిస్తారు. మరి కరోనా విషయంలో ప్రస్తుతం ప్రపంచం ఏ దశలో ఉందన్నది దక్షిణాఫ్రికా పరిశోధనలు రెండింటిని గమనిస్తే తెలుస్తుంది.

ఒమిక్రాన్ కు ఎక్కువ మందిని చేరుకుని, ఇన్ఫెక్షన్ కు గురి చేసే స్వభావం ఉందని తేలింది. మన దేశంలోనూ మొదటి రెండు విడతల్లో జాగ్రత్తగా వైరస్ రాకుండా చూసుకున్న వారు కూడా మూడో విడతలో ఒమిక్రాన్ కు చిక్కుకుంటున్నారు. టీకాలు తీసుకున్న వారు, గతంలో కోవిడ్ బారిన పడిన వారు కూడా ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలుతున్నారు. ఎక్కువ మందికి వైరస్ సోకడం ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీకి దారితీయడం అంటే ఇదే.

హెర్డ్ ఇమ్యూనిటీ అంటే సమాజంలో ఎక్కువ మందికి వైరస్ సోకడం కారణంగా ఏర్పడే రోగనిరోధకత. ప్రజలందరిలోనూ వైరస్ ను ఎదుర్కొనే, నిరోధించే రోగనిరోధకత ఏర్పడుతుంది. అప్పుడు వైరస్ లక్ష్యం చేసుకోవడానికి కొత్తవారు ఎవరూ ఉండరు. దక్షిణాఫ్రికా పరిశోధకుల తాజా అధ్యయనాన్ని పరిశీలిస్తే.. కరోనా గత అల్ఫా, డెల్టా వేరియంట్ల బారిన పడిన వారు కూడా ఇప్పుడు ఒమిక్రాన్ కు గురి కావచ్చు. ఒమిక్రాన్ వైరస్ బారిన పడిన తర్వాత డెల్టాకు గురయ్యే అవకాశం లేదు. ఒమిక్రాన్ వేరియంట్ ఇతర కరోనా వేరియంట్లతో పోలిస్తే బలమైన రోగ నిరోధతకు దారితీస్తుందని గుర్తించారు. అది కూడా టీకాలు తీసుకున్న వారిలో.

ఒమిక్రాన్ లో ఇన్ఫెక్షన్ తీవ్రత ఉండడం లేదు. క్రానిక్, కోమార్బిడిటీలు ఉన్న వారిలోనే ఒమిక్రాన్ తో సమస్యలు చూస్తున్నాం. కనుక హెర్డ్ ఇమ్యూనిటీకి తోడు, వైరస్ బలహీనపడడం కూడా కనిపిస్తోంది. దక్షిణాఫ్రికాకు చెందిన స్టీవ్ బికో అకడమిక్ హాస్పిటల్ వైద్యులు ‘కరోనా మహమ్మారి ముగింపునకు ఒమిక్రాన్ సూచన కావచ్చు’ అని పేర్కొనడం గమనార్హం.

More Telugu News