PRC: ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదు: ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు

  • ఏపీ సర్కారుపై ఉద్యోగ సంఘాల ధ్వజం
  • ప్రభుత్వానివి దుర్మార్గమైన ఎత్తుగడలు అని విమర్శలు
  • ఈ నెల 20న కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి
  • జీవోలన్నీ రద్దు చేసే వరకు పోరాడతామని స్పష్టీకరణ
Employees unions opposed PRC

ఏపీ సర్కారుపై ఉద్యోగ సంఘాల నేతలు మరోసారి అసంతృప్తి బావుటా ఎగరేశారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఈ జీవోలను తిరస్కరిస్తున్నామని ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రేపటి నుంచి రెండ్రోజుల పాటు జరిగే సమావేశాల్లో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని, అవసరమైతే సమ్మె చేసేందుకు వెనుకాడబోమని తేల్చి చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడే పీఆర్సీ ఇవ్వాలని వ్యాఖ్యానించారు.

పీఆర్సీ, హెచ్ఆర్ఏలో కోతను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, పాత పద్ధతిలోనే పీఆర్సీ ఇచ్చేదాకా పోరాడతామని ఉద్ఘాటించారు. ప్రభుత్వం దుర్మార్గమైన ఎత్తుగడలకు పాల్పడుతోందని బండి శ్రీనివాసరావు ఆరోపించారు.

ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ, గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన రాయితీని ఎత్తివేయడం ఏంటని నిలదీశారు. ఐఆర్ కంటే తక్కువ ఫిట్ మెంట్ ఎప్పుడైనా ఉందా? అని ప్రశ్నించారు. తమకు రావాల్సిన డీఏలను అడ్డుపెట్టుకుని పీఆర్సీ ప్రకటించారని విమర్శించారు.

ఈ నెల 20న కార్యాచరణ ప్రకటిస్తామని, తమ ఉద్యమాల ద్వారా జరగబోయే అసౌకర్యానికి ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేశారు. జీవోలన్నీ రద్దు చేసే వరకు పోరాడతామని, తీవ్రస్థాయిలో జరిగే ఉద్యమానికి, సమ్మెలకు ప్రజలు సహకరించాలని బొప్పరాజు విజ్ఞప్తి చేశారు.

More Telugu News