Vaccination: బలవంతంగా వ్యాక్సిన్ వేయించే అంశంపై.. సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే..!

  • వ్యాక్సిన్ వేయించుకోవాలని ఏ ఒక్కరినీ ఒత్తిడి చేయలేం
  • వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి కాదు
  • వ్యాక్సిన్ వేయించుకోవాలని మాత్రమే కేంద్రం చెపుతుంది
Cannot Force A Person to Get Vaccinated says Centre To Supreme Court

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మంది రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నారు. బూస్టర్ డోస్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ జరుగుతోంది. అయితే, ఇప్పటికీ ఒక్క డోసు వ్యాక్సిన్ కూడా వేయించుకోని వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ వేయించుకోని వారికి బలవంతంగా వ్యాక్సిన్ వేయించాలనే చర్చ కూడా జరుగుతోంది. దీనిపై సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

వ్యాక్సిన్ వేయించుకోవాలని ఏ ఒక్కరినీ ఒత్తిడి చేయలేమని సుప్రీంకు కేంద్రం తెలిపింది. అంగవైకల్యంతో బాధ పడుతున్న వారు టీకా కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవడం కష్టతరమని... ఈ నేపథ్యంలో వారికి వారి ఇంటి వద్దకే వెళ్లి వ్యాక్సిన్ వేయాలంటూ సుప్రీంకోర్టులో ఓ స్వచ్ఛంద సంస్థ పిల్ వేసింది. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేకపోతే వారికి ఇబ్బంది కలిగే అవకాశం ఉందని కోర్టుకు తెలిపింది.

ఈ పిల్ పై సుప్రీం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు కేంద్ర అఫిడవిట్ సమర్పించింది. బలవంతగా ఎవరికీ వ్యాక్సిన్ వేయించలేమని అఫిడవిట్ లో కేంద్రం తెలిపింది. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి అనే నిబంధన లేదని చెప్పింది. కేంద్ర వైద్యారోగ్య శాఖ విధించిన కోవిడ్ నిబంధనల్లో బలవంతపు వ్యాక్సినేషన్ ప్రక్రియ లేదని తెలిపింది.

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని మాత్రమే కేంద్రం చెపుతుందని... దీనికి సంబంధించి మీడియా, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా జనాల్లో చైతన్యం తీసుకొచ్చామని చెప్పింది. ఏ ఒక్కరి వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఒత్తిడి చేయలేమని తెలిపింది. వ్యాక్సిన్ వేయించుకోవాలనేది వారి వ్యక్తిగత అంశమని స్పష్టం చేసింది.

More Telugu News