Volcano: పసిఫిక్ లో బద్దలైన అగ్నిపర్వతం.. టోంగాలో సునామీ.. అమెరికా, జపాన్ లకు భారీ సునామీ హెచ్చరిక

  • హూంగా–టోంగా–హూంగా–హాపై అగ్నిపర్వత విస్ఫోటనం 
  • 20 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిసిన బూడిద
  • టోంగాలో సునామీ.. వీధుల్లోకి భారీ వరద
  • పసిఫిక్ మహా సముద్రంలో 9 అడుగుల ఎత్తులో అలలు
Volcano Erupts In Pacific Ocean Tsunami Warning Issued For USA and Japan

టోంగాలోని ఫొనాఫూ దీవుల్లోని హూంగా–టోంగా–హూంగా–హాపై అగ్నిపర్వతం బద్దలైంది. పసిఫిక్ మహాసముద్రంలో భారీ విస్ఫోటనంతో అగ్నిపర్వతం బద్దలవడంతో భారీగా బూడిద ఎగజిమ్మింది. దాదాపు 20 కిలోమీటర్ల ఎత్తుకు బూడిద చేరింది. టోంగాకు 30 కిలోమీటర్ల దూరంలో విస్ఫోటం జరిగినా.. అమెరికాలోని హవాయి, జపాన్, టోంగా అతిపెద్ద దీవి అయిన టోంగాటపు తీరాల్లో భారీ అలలు ఎగిశాయి.

టోంగాటపులో ఇప్పటికే చిన్నపాటి సునామీ వచ్చింది. అక్కడి రోడ్లు వరదమయమయ్యాయి. చాలా వరకు ఆస్తి నష్టం జరిగింది. ప్రజలు భయంతో ఎత్తైన ప్రదేశాలకు పరుగులు తీశారు. టోంగాలోని రాజప్రాసాదం, అక్కడి వీధుల్లోకి వరద చేరింది. దీంతో టోంగా రాజు టుపో 6ను సురక్షిత ప్రదేశానికి తరలించారు. మాతాకి యూవాలోని విల్లాకు తీసుకెళ్లారు. దాంతో పాటు పలు ప్రదేశాల్లోనూ మినీ సునామీలు వచ్చాయని అధికారులు చెప్పారు.

కాగా, విస్ఫోటనంతో పసిఫిక్ లోనూ తీవ్ర ప్రభావం పడింది. న్యూజిలాండ్, జపాన్, అమెరికా, కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలకు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. తీర ప్రాంతాల వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొంటూ నేషనల్ వెదర్ సర్వీస్ హెచ్చరికలను జారీ చేసింది. జపాన్ మీటియరోలాజికల్ ఏజెన్సీ కూడా వార్నింగ్స్ ఇచ్చింది. ఇవాటేలో 9 అడుగుల ఎత్తులో అలలు ఎగుస్తున్నాయని పేర్కొంది. అక్కడక్కడా చిన్న చిన్న సునామీలు కూడా వచ్చాయని చెప్పింది. అయితే, వాటితో ఆస్తి, ప్రాణ నష్టాలు జరగలేదని తీర రక్షక దళాలు పేర్కొన్నాయి.

అమెరికాలోని కాలిఫోర్నియాకూ నేషనల్ వెదర్ సర్వీస్ సునామీ వార్నింగ్ ఇచ్చింది. కాలిఫోర్నియాలోని బీచ్ లు, బోర్డ్ వాక్ లు, హార్బర్లను మూసేశారు. తీరం వద్దకు ఎవరూ వెళ్లరాదంటూ ప్రజలకు అధికారులు సూచనలు చేస్తున్నారు. శాంటా క్రూజ్ లో ఇప్పటికే వరదలు పోటెత్తుతున్నాయి. ఏడడుగుల ఎత్తులో అలలు ఎగుస్తున్నాయి. న్యూజిలాండ్ లోని నార్త్ ఐలాండ్, ఛాతమ్ ఐలాండ్ కు ఆ దేశ నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ సునామీ హెచ్చరికలను జారీ చేసింది.

More Telugu News