womens college: 'మహిళా విశ్వవిద్యాలయం'గా మారనున్న కోఠి మహిళా కళాశాల?

  • మంత్రివర్గ ఉపసంఘానికి మంత్రి కేటీఆర్ సూచన
  • త్వరలో ప్రతిపాదనల రూపకల్పన
  • గతంలోనూ ఓ సారి ప్రయత్నాలు
  • 2024లో నూరు వసంతాలు పూర్తి చేసుకుంటున్న కళాశాల
koti womens college soon likely get university status

శతాబ్దపు ఘన చరిత్ర కలిగిన కోఠి మహిళా కళాశాలకు మహిళా విశ్వవిద్యాలయం హోదా దక్కనుంది. గతంలోనూ ఇందుకు సంబంధించి తెలంగాణ సర్కారు ప్రయత్నాలు చేయగా.. కార్యరూపం దాల్చలేదు. కానీ, ఈ విడత సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ నుంచి ఈ ప్రతిపాదన రావడంతో కోఠి ఉమెన్స్ కాలేజీ యూనివర్సిటీగా మారే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో కేటీఆర్ తాజాగా కోఠి మహిళా యూనివర్సిటీ ప్రతిపాదనను చర్చకు తీసుకొచ్చారు.  నిజాం పాలనలో 1924లో ఏర్పాటైన కోఠి మహిళా కళాశాల 2024లో శతాబ్ది ఉత్సవాలకు వేదిక కానుంది. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ నుంచి ఈ ప్రతిపాదన రావడం గమనార్హం. త్వరలోనే దీనిపై ప్రతిపాదనలను రూపొందించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

గతంలో 2018లో ఒక పర్యాయం కోఠి మహిళా కళాశాలను విశ్వవిద్యాలయంగా మార్చాలని అప్పటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రయత్నాలు చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా చేశారు. కేంద్రం నుంచి రూ.50 కోట్ల నిధుల సాయానికి కూడా ఆమోదం లభించింది. అయినా ఇది ముందుకు పోలేదు.

ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ కళాశాలగా, స్వయం ప్రతిపత్తితో కళాశాల నడుస్తోంది. న్యాక్ గుర్తింపు ఉంది. 42 ఎకరాల్లో కళాశాల విస్తరించి ఉంది. కనుక విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఇబ్బందులు ఉండవని అధికారుల అంచనా. 4,000 మందికి పైగా విద్యార్థినులు ఇక్కడ 42 డిగ్రీ, పీజీ కోర్సులను అభ్యసిస్తుంటారు. అధ్యాపకులు 200 మందికి పైనే ఉన్నారు. కార్యరూపం దాలిస్తే ఏపీకి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వున్నట్టే.. తెలంగాణకు ఒక మహిళా విశ్వవిద్యాలయం సమకూరుతుంది.

More Telugu News