USA: అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు షాకిచ్చిన ఆ దేశ సుప్రీంకోర్టు.. వ్యాక్సినేషన్ విషయంలో అధ్యక్షుడి ఆదేశాల నిలిపివేత!

  • ఆఫీసుల్లోని ఉద్యోగులకు టీకా తప్పనిసరి చేసిన బైడెన్
  • ఆ హక్కు బైడెన్ కు లేదన్న సుప్రీంకోర్టు
  • ఆ నిర్ణయాన్ని కొట్టేస్తూ తీర్పు
  • తీర్పుకు అనుకూలంగా ఆరుగురు జడ్జిలు
  • ముగ్గురు జడ్జిల వ్యతిరేకత
Supreme Court Blocks US President Ruling Over Vaccination

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు ఆ దేశ సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఆఫీసుల్లోని ఉద్యోగులంతా వ్యాక్సిన్ వేసుకోవాలని, మాస్కు ధరించాలని, వారంవారం కరోనా టెస్టు చేయించుకోవాలని ఆయన విధించిన నిబంధనలను కొట్టిపారేసింది. అధికార పరిధిని దాటి బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారంటూ న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు ఇతర ఫెసిలిటీల్లోని ఉద్యోగులకు వ్యాక్సిన్ వేసినట్టు అనుకుంటున్నారా? అంటూ అసహనం వ్యక్తం చేశారు.

51 ఏళ్ల నాటి ఆఫీస్ సేఫ్టీ నిబంధన అమలును ప్రైవేట్ సంస్థల ఉద్యోగులపై రుద్దడం సరైంది కాదని కోర్టు వ్యాఖ్యానించింది. వర్క్ ప్లేస్ సేఫ్టీని నియంత్రించే అధికారంగానీ, హక్కుగానీ లేబర్ డిపార్ట్ మెంట్ కు లేదని తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం స్పష్టం చేసింది. కరోనా అనేది ఇప్పుడు ఇంట్లో ఉన్నా, స్కూలుకు వెళ్లినా, ఆటలాడినా.. ఎక్కడ ఏం చేస్తున్నా వచ్చేస్తోందని పేర్కొంది. ఇదీ.. రోజువారీ జరుగుతున్న నేరాలు, వాయు కాలుష్యం, ఇతర వ్యాధుల లాంటిదేనన్నారు. అయితే, తొమ్మిది మంది న్యాయమూర్తుల్లో ముగ్గురు న్యాయమూర్తులు.. బైడెన్ నిర్ణయాన్ని కొట్టేయడాన్ని వ్యతిరేకించారు.

మరోపక్క, కోర్టు తీర్పుపై  బైడెన్ అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగుల ప్రాణాలను కాపాడే తన నిర్ణయాన్ని కొట్టేయడం దారుణమన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై వెంటనే పెద్ద సంస్థల యజమానులతో సమావేశం నిర్వహించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. కోర్టు నిర్ణయాన్ని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. వ్యాక్సిన్ నిబంధనలతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారిపోయి ఉండేదని ఆయన అన్నారు. బైడెన్ నిర్ణయాన్ని కొట్టేయడంపై గర్వపడుతున్నామన్నారు.

More Telugu News