WHO: కరోనా చికిత్సకు రెండు కొత్త మందులను సిఫార్సు చేసిన డబ్ల్యూహెచ్ వో.. ఒమిక్రాన్ పై వాటి ఎఫెక్ట్ ఎంత?

  • బారిసిటినిబ్, సోట్రోవిమాబ్ కు పచ్చజెండా
  • కార్టికోస్టెరాయిడ్స్ తో కలిపి బారిసిటినిబ్ వాడాలని సూచన
  • సీరియస్ గా ఉన్న కరోనా పేషెంట్లకే ఇవ్వాలని స్పష్టీకరణ
  • ఈ మందుతో ఆక్సిజన్ అవసరం ఉండదని వెల్లడి
  • కరోనా తీవ్రత ఎక్కువగా లేని వారికే సోట్రోవిమాబ్
WHO Recommends Two New Drugs For Covid Treatment

ప్రపంచమంతటా కరోనా విలయ తాండవం చేస్తోంది. ఒమిక్రాన్ తో అతలాకుతలమవుతోంది. మళ్లీ ఆసుపత్రుల్లో ఇన్ పేషెంట్లు పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా చికిత్సకు రెండు కొత్త మందులను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) సిఫార్సు చేసింది. రుమటాయిడ్ ఆర్థ్రయిటిస్, రక్త కేన్సర్, ఎముక మజ్జ కేన్సర్, ఆటో ఇమ్యూన్ వ్యాధులకు వినియోగించే బారిసిటినిబ్ ను కరోనా తీవ్రంగా ఉన్న పేషెంట్లకు ఇవ్వాలని సూచించింది. కార్టికో స్టెరాయిడ్స్ తో కలిపి బారిసిటినిబ్ ను ఇచ్చి చికిత్స చేయాలని పేర్కొంది.

ఈ మందుతో ఆక్సిజన్ అవసరం చాలా వరకు తగ్గుతుందని, పేషెంట్ బతికే అవకాశాలు ఎక్కువ అవుతాయని డబ్ల్యూహెచ్ వో ఆరోగ్య నిపుణులు సూచించడంతో ఆ మందుకు ఓకే చెప్పింది. రక్సోలిటినిబ్, టోఫాసిటినిబ్ లను అస్సలు వాడకూడదని, వాటి వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేకపోగా నష్టాలే ఎక్కువగా ఉంటున్నాయని నిపుణులు హెచ్చరించారు.


తీవ్రత ఎక్కువగా లేని పేషెంట్లకు మోనోక్లోనల్ యాంటీ బాడీ సోట్రోవిమాబ్ తో ట్రీట్ మెంట్ ఇవ్వాలని డబ్ల్యూహెచ్ వో సిఫార్సు చేసింది. అయితే, ఆసుపత్రుల్లో చేరే ముప్పు ఎక్కువగా ఉన్న కరోనా పేషెంట్లకు మాత్రమే సోట్రోవిమాబ్ ను ఇవ్వాలని సూచించింది. ఇంతకుముందు కాసిరివిమాబ్–ఇమ్డెవిమాబ్ అనే మరో మోనోక్లోనల్ యాంటీబాడీకీ ఓకే చెప్పింది.

4,000 మంది కరోనా పేషెంట్లపై చేసిన ఏడు వేర్వేరు ట్రయల్స్ ను ఆధారంగా చేసుకుని ఈ సిఫార్సులు చేసినట్టు డబ్ల్యూహెచ్ వో పేర్కొంది. అయితే, కొత్తగా ఆమోదం తెలిపిన ఈ రెండు మందులు.. ఒమిక్రాన్ పై ప్రభావం చూపిస్తాయా? లేదా? అన్నదానిపై మాత్రం ఎలాంటి స్పష్టత లేదు. మోనోక్లోనల్ యాంటీబాడీ ట్రీట్ మెంట్ కు సంబంధించి మరింత సమాచారం వచ్చినప్పుడు మార్గదర్శకాలను అప్ డేట్ చేస్తామని స్పష్టం చేసింది.

More Telugu News