CPI Narayana: చట్టబద్ధంగా ఎన్నికైన అసోసియేషన్ తో కాకుండా వ్యక్తులతో ఎలా చర్చిస్తారు?: సినిమా టికెట్ల అంశంపై సీపీఐ నారాయణ వ్యాఖ్యలు

  • అపరిష్కృతంగా ఉన్న సినిమా టికెట్ల అంశం
  • సీఎం జగన్ తో చిరంజీవి సమావేశం
  • ఇటీవల పేర్ని నానితో వర్మ భేటీ
  • ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న నారాయణ
CPI Narayana opines on cinema tickets pricing issue

సినిమా టికెట్ల ధరల అంశంలో ఏపీ ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో ఇవాళ మెగాస్టార్ చిరంజీవి సీఎం జగన్ తో సమావేశమయ్యారు. దీనిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. చట్టబద్ధంగా ఎన్నికైన అసోసియేషన్ ఉండగా, వ్యక్తులతో చర్చించడం ఏంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

"సినీ రంగ సంక్షోభానికి సంబంధించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అంతకుముందు వర్మను, ఇవాళ చిరంజీవిని పిలిచి మాట్లాడారు. ఇటీవలే ఓ అసోసియేషన్ చట్టబద్ధంగా ఎన్నికైంది. అలాంటి వాళ్లను పిలిచి మాట్లాడకుండా, కేవలం ప్రచారంలో ఉండడానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. సమస్య పరిష్కారానికి ఏమాత్రం చర్యలు తీసుకోవడంలేదు" అని విమర్శించారు.

"ఓవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు సినిమా వాళ్లను బూతులు తిడుతున్నారు. దాంతో సినిమా వాళ్లు కూడా స్పందించారు. ముఖ్యమంత్రి మాత్రం కొందరిని పిలిపించి మాట్లాడుతున్నారు. ఈ ద్వంద్వ ప్రమాణాలు ఏంటి? బలుపు అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తే వాళ్లెందుకు ఊరుకుంటారు? వాళ్లూ ఏదో ఒకటి మాట్లాడతారు. ఈ నేపథ్యంలో అసలైన వాళ్లతో చర్చించకుండా, ఆ అసోసియేషన్ కు సంబంధం లేనివాళ్లతో మాట్లాడతారా? ఇటీవల ఎన్జీవోల సమస్యను పరిష్కారం చేశారు కదా, ఇది కూడా అలాగే పరిష్కారం చేయండి. అంతేతప్ప సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయొద్దు" అంటూ నారాయణ స్పష్టం చేశారు.

More Telugu News