Voda Idea: వొడాఫోన్ ఐడియాలో కేంద్ర సర్కారుకు 35 శాతం వాటా.. కుప్పకూలిన కంపెనీ షేరు!

  • స్పెక్ట్రమ్ బకాయిలపై వడ్డీకి బదులు ఈక్విటీ వాటా ప్రకటించిన కంపెనీ
  • టెలికం శాఖ ఆమోదిస్తే అతిపెద్ద వాటాదారు సర్కారే
  • 17 శాతం నష్టపోయిన షేరు
Govt may hold 35 percent stake in Voda Idea

టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా తీసుకున్న ఒక నిర్ణయం వాటాదారులకు షాక్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి స్పెక్ట్రమ్ రూపంలో చెల్లించాల్సిన బకాయిలపై వడ్డీ రూ.16,000 కోట్లకు బదులు.. కంపెనీలో 35 శాతం వాటా ఇవ్వాలని నిర్ణయించినట్టు కంపెనీ ప్రకటించింది. ఈ నిర్ణయంతో కంపెనీ ఈక్విటీ మరింత పలుచన కానుంది. అంటే కొత్తగా 35 శాతం ఈక్విటీ షేర్లు ఏర్పాటవుతాయి. దీంతో ప్రస్తుత వాటాదారులకు ఆ మేరకు పరోక్ష నష్టం ఉంటుంది.

‘‘కంపెనీ ఈక్విటీలో ప్రభుత్వానికి 35.8 శాతం వాటా ఉండొచ్చు. అప్పుడు వొడాఫోన్ గ్రూపు ప్రమోటర్లకు 28.5 శాతం, ఆదిత్య బిర్లా గ్రూపునకు 17.8 శాతం చొప్పున వాటా ఉంటుంది. స్పెక్ట్రమ్ బకాయిలపై వడ్డీ రూ.16,000 కోట్లుగా ఉంటుందని మా అంచనా. టెలికం శాఖ దీన్ని ఇంకా నిర్ధారించాల్సి ఉంది. 2021 ఆగస్ట్ 14కు ముందు కంపెనీ షేరు సగటు ధర రూ.10లోపే ఉంది. కనుక ప్రభుత్వానికి రూ.10 చొప్పునే షేరును కేటాయించడం ఉంటుంది’’ అంటూ వొడాఫోన్ ఐడియా ప్రకటించింది.

టెలికం రంగాన్ని గట్టెక్కించేందుకు కేంద్ర సర్కారు గతేడాది కొన్ని నిర్ణయాలు ప్రకటించింది. అందులో భాగంగా స్పెక్ట్రమ్ బకాయిల చెల్లింపులను నాలుగేళ్లపాటు వాయిదా వేసుకునే ఆప్షన్ ను వొడాఫోన్ తీసుకుంది. వడ్డీ బకాయిల చెల్లింపులకు బదులు ఈక్విటీ కేటాయింపు ఆప్షన్ ను కూడా ఇచ్చింది.

రూ.లక్ష కోట్లకు పైగా రుణ భారంతో వొడాఫోన్ ఐడియా జీవన్మరణ సమస్య ఎదుర్కోవడం తెలిసిందే. అదనపు పెట్టుబడులు పెట్టలేక ప్రతీ నెలా కస్టమర్లను కూడా నష్టపోతోంది. ఈ క్రమంలో తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కంపెనీ నిర్ణయంతో వాటాదారులు కంగుతిన్నారు. షేరు ధరపై ఈ నిర్ణయం ప్రభావం చూపింది. బీఎస్ఈలో 17 శాతానికి పైగా నష్టపోయి రూ.12.30 వద్ద ట్రేడవుతోంది.

More Telugu News