Singireddy Niranjan Reddy: బ్యాంకుల‌కు సెల‌వు కాబ‌ట్టి అందరికీ రైతుబంధు డ‌బ్బులు ప‌డ‌లేదు.. అపోహ‌లు వ‌ద్దు: తెలంగాణ మంత్రి నిరంజ‌న్‌రెడ్డి

  • రైతు బంధు నిధుల పంపిణీ కొన‌సాగుతోంది
  • అందరికీ రైతుబంధు పథకం డ‌బ్బులు అందుతాయి
  • 60,16,697 మంది రైతుల ఖాతాల్లో డ‌బ్బు జమ 
niranjan reddy on raithu bandhu

తెలంగాణ‌లో పెట్టుబ‌డి సాయం కింద ప్ర‌భుత్వం ఇస్తోన్న‌ రైతు బంధు నిధుల పంపిణీ కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే. పండుగ ముందు డ‌బ్బులు ప‌డుతుండ‌డంతో రైతులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే, చాలా మంది ల‌బ్ధిదారుల ఖాతాల్లో ఇప్ప‌టికీ డ‌బ్బులు ప‌డ‌క‌పోవ‌డంతో అనేక ర‌కాల ఊహాగానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనిపై తెలంగాణ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స్పందించారు.

ఎవ‌రికీ ఎలాంటి అపోహ‌లూ అవ‌స‌రం లేదని, అందరికీ రైతుబంధు పథకం అందుతుందని చెప్పారు. ఈ నెల‌లో బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెలవు దినాలు వచ్చాయని ఆయ‌న చెప్పారు. నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రావడంతో రైతుబంధు డబ్బులు కొంద‌రు రైతుల ఖాతాల్లో జ‌మ కావ‌డంతో ఆల‌స్యం అవుతుంద‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే రైతుల‌ ఖాతాల్లో రైతుబంధు డబ్బులు వేస్తార‌ని వివ‌రించారు.

డ‌బ్బులు ఆల‌స్యంగా ప‌డుతుండ‌డంపై కొందరు ఉద్దేశ‌పూర్వ‌కంగా అపోహలు సృష్టిస్తున్నారని మండిప‌డ్డారు. ఇటువంటి వ‌దంతుల‌ను రైతులు నమ్మకూడదని చెప్పారు. రైతు బంధు కింద‌ ఇప్పటి వరకు మొత్తం 60,16,697 మంది రైతుల ఖాతాల్లో మొత్తం రూ.6,008.27 కోట్లు జమ చేశామ‌ని తెలిపారు. ల‌బ్ధిదారుల జాబితాలో ఉన్న మిగిలిన‌ రైతులందరికీ ఒకటి, రెండు రోజుల్లో రైతుబంధు నిధులు జమ అవుతాయని స్ప‌ష్టం చేశారు.

కాగా, రైతు బంధు డ‌బ్బులు ఖాతాల్లో ప‌డ‌డంతో ప‌లు జిల్లాల్లో టీఆర్ఎస్ ఆధ్వ‌ర్యంలో కొంద‌రు రైతులు సంబ‌రాలు జ‌రుపుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు. ఖమ్మం హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్ వ‌ద్ద 50 క్వింటాళ్ల కూరగాయలతో 1,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో కేసీఆర్‌ చిత్రపటం ఏర్పాటు చేయ‌డం గ‌మ‌నార్హం.

More Telugu News