Mohammed Mohsin Ali Maaz: ఆస్ట్రేలియాలో ఆచూకీ లేకుండా పోయిన హైదరాబాద్ విద్యార్థి

  • 2018లో ఆస్ట్రేలియా వెళ్లిన మహ్మద్ మాజ్
  • మాస్టర్స్ డిగ్రీ కోసం మెల్బోర్న్ వర్సిటీలో చేరిక
  • గత 10 రోజులుగా మిస్సింగ్
  • తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు
Hyderabad student Mohammed Mohsin Ali Maaz went missing in Australia

హైదరాబాదుకు చెందిన ఓ విద్యార్థి ఆస్ట్రేలియాలో కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది. అతడి పేరు మహ్మద్ మొహిసిన్ అలీ మాజ్. హైదరాబాదులోని చంచల్ గూడ అతడి స్వస్థలం. 28 ఏళ్ల మహ్మద్ మాజ్ మాస్టర్స్ డిగ్రీ కోసం 2018లో అతడు ఆస్ట్రేలియా వెళ్లి మెల్బోర్న్ యూనివర్సిటీలో చేరాడు. కొన్నాళ్ల కిందట తాను బస చేస్తున్న ప్రదేశం నుంచి ఖాళీ చేశాడని మహ్మద్ స్నేహితులు వెల్లడించారు. అయితే, గత 10 రోజులుగా అతడి ఆచూకీ తెలియరాలేదు. దాంతో అతడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

అతడి ఆచూకీ కోసం ఆస్ట్రేలియాలోని విక్టోరియా పోలీసులు తీవ్ర గాలింపు చేపట్టారు. ఆసుపత్రుల్లో అతడి వివరాల కోసం వాకబు చేస్తున్నారు. ప్రమాద ఘటనలకు సంబంధించిన కేసుల్లోనూ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎక్కడా అతడి వివరాలు లభ్యం కాలేదు. ప్రమాద ఘటనల్లో తమ కుమారుడి వివరాలు లేకపోవడంతో, మహ్మద్ తండ్రి తన కుమారుడు ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉండి ఉంటాడన్న నమ్మకం కలుగుతోందని అన్నారు.

మహ్మద్ బంధువులు ఎంబీటీ పార్టీ నేత, సామాజిక కార్యకర్త అంజాద్ ఉల్లా ఖాన్ సాయంతో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను అర్థించారు. మహ్మద్ ఆచూకీ తెలుసుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

More Telugu News