weddings: హైదరాబాద్ లో వాయిదా పడుతున్న పెళ్లిళ్లు, ప్రదర్శనలు, సభలు

  • హైటెక్స్ లో కార్యక్రమాలు వాయిదా
  • బాంకెట్ హాళ్లు కూడా ఖాళీ
  • ఘనంగా వివాహం చేసుకున్నా అతిథుల కరవు
  • నలుగురితోనే పూర్తి చేసే ధోరణి
Weddings Cancelled Under Omicron Shadow in Hyderabad

ఊహించని విధంగా కరోనా కేసులు వచ్చి పడుతుండడంతో హైదరాబాద్ లో పెళ్ళిళ్లు, ప్రదర్శనలు (ఎగ్జిబిషన్లు), సభలు, సమావేశాలు వాయిదా పడుతున్నాయి. కొన్ని రద్దవుతుంటే, కొన్నింటిని వాయిదా వేసుకుంటున్నారు.

ఎగ్జిబిషన్లు, జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలు హైదరాబాద్ లో పెద్ద సంఖ్యలోనే నడుస్తుంటాయి. ఏటా 100 వరకు పెద్ద కార్యక్రమాలకు హైదరాబాద్ వేదికగా నిలుస్తుంటుంది. కానీ కరోనాతో గత రెండేళ్లు ఈ మార్కెట్ దెబ్బతిన్నది.

హైటెక్ సిటీ వద్దనున్న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ ప్రముఖమైనది. ‘‘జనవరి నెలకు సంబంధించి ఇప్పటికే ఐదు కార్యక్రమాలు రద్దయ్యాయి. ఈ నెలలోనే జరగాల్సిన మరో నాలుగు కార్యక్రమాలపై అనిశ్చితి నెలకొంది’’అని హైటెక్స్ ఎగ్జిబిషన్ యాజమాన్యం పేర్కొంది.

బాంక్వెట్ హాళ్లు, హోటళ్లలో పెద్ద ఎత్తున వేడుకలు, ప్రదర్శనలు నడుస్తుంటాయి. ఎక్కువ కార్యక్రమాలకు ఇవే వేదికలుగా ఉంటాయి. కానీ కేసులు పెరుగుతుండడంతో ఇటీవల కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నారని, వాయిదా పడుతున్నాయని హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అంటోంది.

ఘనంగా పెళ్ళి వేడుకలు నిర్వహిద్దామనుకున్న వారు కూడా సింపుల్ గా కానిచ్చేదామనే ఆలోచనకు వస్తున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున అతిథులను పిలిచినా వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో పరిమిత అతిథులకు ఆహ్వానం పంపుతున్నారు.

కరోనా కేసులు పెరిగిపోవడంతో పిలిచినా ఇంటిల్లిపాదీ వచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. దీంతో అనవసర ఖర్చు ఎందుకన్న భావనతో ఘనమైన వేడుకలను రద్దు చేసుకుని, కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు పది మంది సమక్షంలోనే వివాహం జరిపించేద్దామన్న ధోరణి కూడా కనిపిస్తోంది.

More Telugu News