Kurnool District: ఆత్మకూరులో తీవ్ర ఉద్రిక్తత.. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు

  • ప్రార్థనా మందిరం నిర్మాణంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ
  • బీజేపీ నేత శ్రీకాంత్‌రెడ్డి కారు ధ్వంసం, ఆపై నిప్పు
  • పోలీస్ స్టేషన్‌పై రాళ్లు రువ్విన ఆందోళనకారులు
  • ఓ కానిస్టేబుల్, ఇద్దరు ఎస్సైలకు గాయాలు
  • మత పెద్దలతో చర్చించి పరిస్థితిని అదుపులోకి తెచ్చిన ఎస్పీ
Tension prevails in Kurnool dist atmakur police fires into the air

కర్నూలు జిల్లా ఆత్మకూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ ప్రార్థనా మందిరం నిర్మాణం విషయంలో ఇరు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ చివరికి కాల్పులకు దారితీసింది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని తోటగేరి వద్ద  ఓ వర్గానికి చెందిన కొందరు ప్రార్థనా మందిర నిర్మాణాన్ని చేపట్టారు. దీనిపై అందిన ఫిర్యాదులతో మునిసిపల్ అధికారులు ఆ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. అయితే, నిన్న మళ్లీ పనులు ప్రారంభం కావడంతో కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.

విషయం తెలిసిన నంద్యాల బీజేపీ అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి అక్కడికి వెళ్లి నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాటామాట పెరిగింది. ఓ వర్గం వారు శ్రీకాంత్‌పై దాడికి యత్నించగా ఆయన తప్పించుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం మార్గమధ్యంలో బైక్‌ను ఢీకొంది. దానిపై ఉన్న ఇద్దరు యువకులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు.

గాయపడిన వారు తమ వర్గానికి చెందినవారే కావడంతో వారు మరింతగా రెచ్చిపోయారు. శ్రీకాంత్‌రెడ్డిపై దాడికోసం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టి శ్రీకాంత్‌రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశారు. డీఎస్పీ శ్రుతి అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులు గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు.

అయినప్పటికీ వెనక్కి తగ్గని ఆందోళనకారులు శ్రీకాంత్‌రెడ్డి వాహనానికి నిప్పు పెట్టారు. పోలీస్ స్టేషన్‌పై రాళ్లు రువ్వారు. రాళ్లు బలంగా తగలడంతో ఓ కానిస్టేబుల్ కంటికి గాయమైంది. మరో ఇద్దరు ఎస్సైలు కూడా గాయపడ్డారు. విషయం ఎస్పీ దృష్టికి వెళ్లడంతో ఆయన రాత్రి పది గంటల సమయంలో పోలీస్ స్టేషన్‌‌కు చేరుకున్నారు. మత పెద్దలతో చర్చలు జరపడంతో ఘర్షణ చల్లారింది.

More Telugu News