Asaduddin Owaisi: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు డిజిటల్ ప్రచారం చేసుకోవాలన్న ఎన్నికల సంఘం... స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ

  • ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు
  • షెడ్యూల్ ప్రకటన చేసిన ఎన్నికల సంఘం
  • కరోనా రీత్యా డిజిటల్ ప్రచారం చేసుకోవాలని సూచన
  • యూపీలో ఇంటర్నెట్ వినియోగం తక్కువన్న ఒవైసీ
Asaduddin Owaisi reacts to ECI suggestion on digital campaign

కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నెల 15 వరకు ర్యాలీలు, రోడ్ షోలు, ఇతర ప్రచార కార్యక్రమాలపై నిషేధం విధించింది. ఈ నెల 15 తర్వాత పరిస్థితిని సమీక్షించి ఎన్నికల ప్రచారంపై నిర్ణయం తీసుకుంటామని, అప్పటివరకు రాజకీయ పక్షాలు డిజిటల్ (సోషల్ మీడియా) ప్రచారం చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. దీనిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.

ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల సవాలను తాము స్వీకరిస్తున్నామని తెలిపారు. అల్లా దయతో తాము సర్వశక్తులు ఒడ్డి పోరాడతామని స్పష్టం చేశారు. అయితే, జనవరి 15 తర్వాత ఎన్నికల సంఘం తన మార్గదర్శకాలను మరోసారి సమీక్షిస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో డిజిటల్ సమాచార వినియోగం ఎలా ఉందన్నదానిపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారిస్తే బాగుంటుందని ఒవైసీ సూచించారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో ఇంటర్నెట్ పరిస్థితులను గమనించాలని తెలిపారు.

నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం యూపీలో ప్రతి 100 మందిలో కేవలం 39 మందే ఇంటర్నెట్ వినియోగిస్తుంటారని వెల్లడించారు. భారత్ లో అత్యంత తక్కువగా ఇంటర్నెట్ వినియోగించే ప్రాంతాల్లో ఇదీ ఒకటని వివరించారు. ఇక ఎన్ఎస్ఎస్ నివేదిక ప్రకారం యూపీలోని గ్రామీణ ప్రాంతాల్లో కంప్యూటర్లు ఉన్న గృహాలు 4 శాతం, ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నవారి శాతం 11 మాత్రమేనని పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్ లోని ధనిక వర్గాల్లో 19 శాతం మందికి ఇంటర్నెట్ సదుపాయం ఉండగా, పేదల్లో 6 శాతం మందికే అందుబాటులో ఉందని తెలిపారు. యూపీ పట్టణ ప్రాంతాల్లో 50 శాతం మహిళలు ఇప్పటివరకు ఇంటర్నెట్ ను వినియోగించలేదని, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగం తెలియని వాళ్లు 76 శాతం మంది ఉన్నారని ఒవైసీ వివరించారు.

రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో కనీసం ఒకసారి ఇంటర్నెట్ వినియోగించిన పురుషుల శాతం 54 కాగా, రాష్ట్రంలో 46.5 శాతం మంది మహిళలకే సొంత అవసరాల నిమిత్తం ఫోన్లు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో డిజిటల్ ప్రచారం నిర్వహించడం ఎలా? అంటూ అసదుద్దీన్ విమర్శనాత్మకంగా స్పందించారు.

More Telugu News