WHO: ఒమిక్రాన్ ను తక్కువ అంచనా వేయొద్దు.. అది ప్రాణాంతకమే: డబ్ల్యూహెచ్ వో చీఫ్

  • జనాల ప్రాణాలను తీస్తోందన్న టెడ్రోస్
  • ఒమిక్రాన్ పేషెంట్లతో ఆసుపత్రులు నిండుతున్నాయని వెల్లడి
  • ఆసుపత్రిపాలయ్యే ముప్పును టీకాలు తగ్గిస్తాయని కామెంట్
  • ఈ ఏడాది ప్రథమార్ధం నాటికి అన్ని దేశాల్లో 70% టీకాలు వేయాలి
  • వ్యాక్సిన్ అసమానతలే జనాల ప్రాణాలు తీస్తున్నాయని ఆవేదన
Who Chief Tedros Warns Omicron Is a Killer

మహమ్మారి ఉద్ధృతి ఎక్కువగా ఉందని, గత వారం కేసులు భారీగా నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోం ఘెబ్రియేసస్ అన్నారు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ తీవ్రత తక్కువే అయినప్పటికీ.. దాన్ని తేలిగ్గా తీసుకోవద్దని, తక్కువ అంచనా వేయొద్దని ఆయన హెచ్చరించారు. ఇంతకుముందు వచ్చిన వేరియంట్ల మాదిరే ఒమిక్రాన్ కూడా జనాన్ని ఆసుపత్రుల పాల్జేస్తోందని, ప్రాణాలు తీస్తోందని హెచ్చరించారు.

ఒమిక్రాన్ తో కేసులు వేగంగా, విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులు ఒమిక్రాన్ పేషెంట్లతో నిండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వారికి చికిత్సనందించేందుకు సరిపడా సిబ్బంది కూడా లేరని చెప్పారు. దీని వల్ల కొవిడ్ తోనే కాకుండా.. సమయానికి సరైన చికిత్స అందక ఇతర జబ్బులతో బాధపడేవారు కూడా చనిపోయే ప్రమాదముందని హెచ్చరించారు.

తొలి తరం కరోనా వ్యాక్సిన్లు.. కొత్త వేరియంట్లను ఆపలేకపోయినా ప్రభావవంతంగానే పనిచేస్తాయని, కనీసం ఆసుపత్రుల్లో చేరాల్సిన ముప్పును, మరణాల ముప్పును తగ్గిస్తాయని టెడ్రోస్ చెప్పారు. ఈ ఏడాది ప్రథమార్ధం నాటికి అన్ని దేశాల్లో 70 శాతం మేర వ్యాక్సినేషన్ పూర్తయితే మహమ్మారిని కట్టడి చేయవచ్చని పేర్కొన్నారు. ఇప్పుడు జరుగుతున్న వ్యాక్సినేషన్ తో 109 దేశాలు ఆ టార్గెట్ ను అందుకోలేవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దానికి కారణం వ్యాక్సిన్ అసమానతలేనన్నారు.

టెస్ట్ కిట్లు, పీపీఈ కిట్ల దగ్గర్నుంచి వ్యాక్సిన్ల దాకా పేద దేశాలకు అన్యాయమే జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద దేశాలే వాటన్నింటినీ స్టాక్ పైల్ చేసి పెట్టుకుంటున్నాయన్నారు. కరోనా మహమ్మారిని అంతం చేయడంలో గత ఏడాది అతి పెద్ద వైఫల్యం అదేనన్నారు. ఈ వ్యాక్సిన్ అసమానతలే ప్రజలను, ఉపాధిని చంపేస్తున్నాయన్నారు. దాని వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలూ కోలుకోవడం కష్టమన్నారు.

ప్రస్తుతం కొన్ని దేశాలు నాలుగో డోస్ కూడా వేసేందుకు సిద్ధమవుతున్నాయని, కానీ, చాలా పేద దేశాల్లో కనీసం వైద్య సిబ్బందికీ వేసేందుకు సరిపడా వ్యాక్సిన్లు లేవని అన్నారు. కొన్ని దేశాల్లో బూస్టర్ డోసులు వేసినంత మాత్రాన మహమ్మారి నియంత్రణలోకి రాదని తేల్చి చెప్పారు. కాబట్టి ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న టీకాలను అన్ని దేశాలకూ సమానంగా పంచాలని ఆయన సూచించారు.

కరోనా కట్టడి కష్టంగా మారిన మానవ, యుద్ధ సంక్షోభాలను ఎదుర్కొంటున్న దేశాలకు వ్యాక్సిన్లను అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఉదాహరణకు తాలిబన్ల ఆక్రమణతో ఆఫ్ఘనిస్థాన్ లోని మూడొంతుల ఆసుపత్రుల్లో అత్యవసరమైన మందులకు కొరత ఏర్పడిందని చెప్పారు. అయితే, గత ఏడాది డిసెంబర్ నాటికి యునిసెఫ్ తో కలిసి అక్కడి 2,300 ఆసుపత్రులకు అవసరమైన సామగ్రి, మందులను అందించామని, 25 వేల మంది వైద్య సిబ్బందికి జీతాలు చెల్లించామని తెలిపారు.

More Telugu News