WHO: కరోనా కేసుల ఉద్ధృతిపై డబ్ల్యూహెచ్ వో ఆందోళన.. ఒక్కవారంలోనే 71% పెరుగుదల!

  • డిసెంబర్ 27–జనవరి 2 వీక్లీ రిపోర్ట్ లో వెల్లడి
  • 95 లక్షల కేసులు, 41 వేల మరణాలు నమోదు
  • అత్యధికంగా అమెరికాలోనే 25,56,690 కేసులు
Covid Cases Increased 71 Percent Compared To Past Week World Wide

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాది డిసెంబర్ 27 నుంచి ఈ ఏడాది జనవరి 2 వరకు వారం రోజుల్లోనే మహమ్మారి కేసులు 71 శాతం పెరిగాయని హెచ్చరించింది.

అదే సమయంలో మరణాలు మాత్రం 10 శాతం తగ్గాయని తెలిపింది. ఆ వారంలో ప్రపంచమంతటా 95 లక్షల కొత్త కేసులు నమోదు కాగా.. 41 వేల మంది చనిపోయినట్టు తెలిపింది. జనవరి 2 నాటికి మొత్తంగా 28.9 కోట్ల మంది కరోనా బారిన పడ్డారని వెల్లడించింది. 54 లక్షల మంది చనిపోయారని పేర్కొంది. ఈ మేరకు కరోనా కేసుల వారపు నివేదికను డబ్ల్యూహెచ్ వో విడుదల చేసింది.

కాగా, అన్ని రీజియన్లలోనూ కరోనా కేసులు పెరిగిపోయాయని డబ్ల్యూహెచ్ వో ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, అన్నింట్లోకెల్లా అమెరికా రీజియన్ లోనే అత్యధికంగా కేసులు పెరుగుతున్నాయని తెలిపింది. అక్కడ అంతకుముందు వారంతో పోలిస్తే 100 శాతం మేర కేసులు ఎక్కువగా నమోదయ్యాయని పేర్కొంది.

ఆ తర్వాత ఆగ్నేయాసియాలో 78%, యూరప్ లో 65 శాతం, తూర్పు మధ్యదరా ప్రాంతంలో 40%, పశ్చిమ పసిఫిక్ లో 38%, ఆఫ్రికాలో 7 శాతం చొప్పున కేసులు పెరిగాయని తెలిపింది. ఆఫ్రికా రీజియన్ లో కేసుల పెరుగుదల తక్కువగానే ఉన్నా.. మరణాలు మాత్రం అత్యధికంగా 22 శాతం పెరిగాయని డబ్ల్యూహెచ్ వో ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికాలో 18%, పశ్చిమ పసిఫిక్ లో 10%, ఆగ్నేయాసియాలో 9%, తూర్పు మధ్యదరా ప్రాంతంలో 7, యూరప్ లో 6 శాతం చొప్పున మరణాలు పెరిగాయని పేర్కొంది.

ఇక అమెరికాలో అత్యధికంగా ఒక్క వారంలోనే 25,56,690 కరోనా కేసులు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్ వో వెల్లడించింది. అంతకుముందు వారంతో పోలిస్తే 92 శాతం అధికమని చెప్పింది. ఆ తర్వాత బ్రిటన్ లో 11,04,316 కొత్త కేసులు వచ్చినట్టు చెప్పింది. ఫ్రాన్స్ లో 117 శాతం పెరుగుదలతో 10,93,162, స్పెయిన్ లో 60 శాతం పెరుగుదలతో 6,49,832, ఇటలీలో 150 శాతం పెరుగుదలతో 6,44,508 కొత్త కేసులు నమోదైనట్టు డబ్ల్యూహెచ్ వో పేర్కొంది.

More Telugu News