old man: నెలకు ఒకటి చొప్పున 11 కోవిడ్ టీకా డోసులు తీసుకున్న వృద్ధుడు.. విచారణ మొదలు!

  • 2021 ఫిబ్రవరిలో మొదటి డోసు
  • డిసెంబర్ నాటికి 11 సార్లు టీకా
  • బిహార్ లోని మాధేపురా జిల్లాలో వెలుగులోకి
  • నిజమా? అబద్దమా? అన్న దానిపై విచారణ  
old man from bihar madhepura taken 11 times jabs

బిహార్ లోని మాధేపురా జిల్లా ఒరాయ్ ప్రాంతానికి చెందిన 84 ఏళ్ల బ్రహ్మదేవ్ మండల్ చేసిన ప్రకటన స్థానిక అధికార యంత్రాంగం విస్తుపోయేలా చేసింది. తాను ఇప్పటి వరకు 11 సార్లు కోవిడ్ టీకా తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. 2021 ఫిబ్రవరిలో మొదటి డోసును తీసుకున్నట్టు చెప్పారు. అలా 2021 డిసెంబర్ నాటికి 11 నెలల్లో 11 డోసులు తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

అయితే, 12వ డోసు కూడా తీసుకునేందుకు ప్రయత్నించగా అది సఫలం కాలేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లేసరికే అక్కడ టీకాలు ఇవ్వడం పూర్తయిపోవడంతో తీసుకోలేకపోయినట్టు చెప్పారు. పైగా ప్రతీ డోసు ఏ తేదీన తీసుకున్నది ఆయన ఒక పేపర్ పై రాసుకోవడం గమనార్హం. దీనిపై స్థానిక అధికారులు విచారణ ప్రారంభించారు.

నిజానికి ఒక్కరికి రెండు డోసులే టీకా ఇస్తారు. అది కూడా కోవిన్ యాప్ లో ఆధార్ నంబర్ తో రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం ఓటీపీతో ధ్రువీకరించాలి. ఆధార్ నంబర్ తప్పనిసరి కావడంతో ఒక్కరు రెండు సార్లకు మించి టీకా తీసుకునేందుకు వస్తే తెలిసిపోతుంది. అయితే రిజిస్ట్రేషన్ లేకుండా బ్రహ్మదేవ్ తీసుకుని ఉంటాడా?.. లేదంటే ప్రచారం కోసం అలా చెప్పాడా? అన్నది విచారణలో స్పష్టం కావాల్సి ఉంది.

More Telugu News