RGV: 'గౌరవనీయులైన ఆర్జీవీ.. మీ నెత్తిన ఎక్కి తొక్కామా?'.. అంటూ గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చిన పేర్ని నాని

  • టికెట్ రూ.2000కి అమ్ముకోవచ్చని ఏ బేసిక్ ఎకనమిక్స్ చెప్పాయ్?
  • ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారు?
  • సామాన్యుడి మోజుని, అభిమానాన్ని లూటీ చేయడం కాదా?
  • సామాన్యుడిని దోచుకోకుండా ఆపాం అన్న మంత్రి 
perni nani slams rgv

ఏపీ ప్ర‌భుత్వం సినిమా టికెట్ల ధ‌ర‌లు త‌గ్గించ‌డంపై వివాదం రాజుకున్న విష‌యం తెలిసిందే. దీనిపై వివాదాస్ప‌ద‌ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ స్పందిస్తూ 'ప్రియ‌మైన గౌర‌వనీయులైన ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గారూ' అంటూ ఆయ‌న‌కు ప‌లు ప్ర‌శ్న‌లు సంధించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దీంతో ఆర్జీవీ చేసిన ట్వీట్ల‌కు ఆయ‌న స్టైల్‌లోనే పేర్ని నాని స‌మాధానాలు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. అయితే, ఆర్జీవీనే పేర్ని నాని రివ‌ర్స్‌లో కొన్ని ప్ర‌శ్న‌లు అడ‌గ‌డం గ‌మ‌నార్హం.

'గౌరవనీయులైన ఆర్జీవీ గారూ... మీ ట్వీట్లు చూశాను. నాకు ఉన్న సందేహాన్ని తెలియపరుస్తున్నాను. రూ.100 టికెట్ ను రూ.1000 కి, 2000కి అమ్ముకోవచ్చని ఏ బేసిక్ ఎకనమిక్స్ చెప్పాయ్? ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారు? డిమాండ్, సప్లై అంటారా? లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా?  

సామాన్యుడి మోజుని, అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి లేకుండా చూసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 66 ఏళ్లుగా చట్టాలకు లోబడే సినిమా టికెట్ ధరను నిర్ణయిస్తున్నాయి. ఉప్పూ పప్పూలాంటి నిత్యావసర వస్తువుల ధరల్ని మాత్రమే ప్రభుత్వం నియంత్రించవచ్చు గానీ, సినిమా టికెట్ల ధరల్ని ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని అడిగారు. థియేటర్లు అనేవి ప్రజా కోణంలో వినోద సేవలు పొందే ప్రాంగణాలు.

బలవంతంగా ధరలు తగ్గిస్తే మోటివేషన్‌ పోతుందన్నది ఎకనామిక్స్‌లో ప్రాథమిక సూత్రం అని చెప్పారు. ఎవరికి వర్మగారూ?  కొనేవారికా? అమ్మేవారికా? మీరు ఎంతవరకూ ప్రొడ్యూసర్స్‌ శ్రేయస్సు గురించే మాట్లాడుతూ వినియోగ‌దారుల‌ యాంగిల్‌ను గాలికి వదిలారు. కాస్త ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించండి వర్మ గారూ!

పేర్ని నాని సినిమాను అత్యవసర సర్వీసుగా ప్రభుత్వం భావిస్తుంటే... మెడికల్, ఎడ్యుకేషన్‌ మాదిరిగానే సబ్సిడీని ప్రభుత్వం భరించాలని మీరు అడిగారు. సినిమాను మేం నిత్యావసరంగా గానీ, అత్యవసరంగా గానీ భావించటం లేదు ఆర్జీవీ గారూ.

థియేటర్‌లో సినిమా టికెట్ల ధరల్ని ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలని మాత్రమే 1970 సినిమాటోగ్రఫీ చట్టం ద్వారా వచ్చిన నిబంధనలు చెబుతున్నాయి. హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్‌కు ఒక ఫార్ములా చెప్పారు. మీరు ఏ హీరోకు ఎంత ఇస్తారు? ఎంత ఖర్చుతో సినిమా తీస్తారు? అన్నది పరిగణనలోకి తీసుకుని ఏనాడూ థియేటర్లలో టికెట్ల ధరను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ నిర్ణయించదు ఆర్జీవీ గారూ.

ఒక వస్తువుకు సంబంధించిన మార్కెట్‌ ధర నిర్ణయంలో అసలు ప్రభుత్వానికి ఉన్న పాత్ర ఏమిటో సమాధానమివ్వండని మీరు అడిగారు. సినిమా ఒక వస్తువు కాదు. అది వినోద సేవ మాత్రమే. ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని మేం చేస్తున్నది థియేటర్లలో టికెట్‌ ధరల నియంత్రణ మాత్రమే తప్ప, సినిమా నిర్మాణ నియంత్రణ ముమ్మాటికీ కాదు.

మీకు కింది నుంచి మద్దతు ఇవ్వటానికి ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చారని, మీ నెత్తిన ఎక్కి తొక్కటానికి కాదన్నారు. సినిమా టికెట్‌ను ఎంతకైనా అమ్ముకోనిస్తే పరిశ్రమకు కింది నుంచి బలాన్ని ఇచ్చినట్టు. సామాన్యుడిని దోచుకోకుండా ఆపితే మీ నెత్తిన ఎక్కి తొక్కినట్టు మీరు ప్రవచించటం సబబేనా వర్మ గారూ?' అంటూ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.

More Telugu News