Punjab: ఒమిక్రాన్ ఎఫెక్ట్... పంజాబ్ లో విద్యాసంస్థల మూసివేత

  • దేశంలో మళ్లీ పుంజుకుంటున్న కరోనా
  • మరోవైపు ఒమిక్రాన్ దూకుడు
  • తాజా మార్గదర్శకాలు జారీ చేసిన పంజాబ్ సర్కారు
  • నైట్ కర్ఫ్యూ అమలు.. ఈ నెల 15 వరకు ఆంక్షలు
Punjab govt orders to close educational institutions amid Omicron scares

కరోనా మళ్లీ పంజా విసురుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరోసారి ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి. గడచిన కొన్నిరోజులతో పోల్చితే ఇప్పుడు మూడు రెట్లు అధికంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో భారత్ లో 30 వేలకు పైగా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. దీనికి తోడు ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండడం బెంబేలెత్తిస్తోంది.

ఈ నేపథ్యంలో అనేక రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. పంజాబ్ లోనూ ఒమిక్రాన్ వ్యాప్తి అధికమవుతుండడంతో అక్కడి ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలో పాఠశాలలు, కాలేజీలు మూసివేయాలని ఆదేశించింది. క్రీడా ప్రాంగణాలు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్ లు కూడా పూర్తిగా మూసివేయాలని పేర్కొంది. రాత్రి పూట 10 గంటల నుంచి ఉదయం 5 గంటలకు కర్ఫ్యూ అమల్లోకి తెచ్చింది. కాగా, విద్యాసంస్థలు ఆన్ లైన్ బోధన కొనసాగించుకోవచ్చని పేర్కొంది. వైద్య, నర్సింగ్ కళాశాలలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని పేర్కొంది.

ఇక, సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ లు, రెస్టారెంట్లు, బార్లు, షాపింగ్ మాల్స్, స్పాలు, జంతుప్రదర్శనశాలలు, మ్యూజియంలను 50 శాతం సామర్థ్యంతో నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న సిబ్బందినే ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో విధులు నిర్వర్తించేందుకు అనుమతించాలని తాజా మార్గదర్శకాల్లో వివరించింది. తాజా మార్గదర్శకాలు ఈ నెల 15 వరకు అమల్లో ఉంటాయని తెలిపింది.

More Telugu News