RGV: సినిమా టికెట్ల ధ‌ర‌ల వివాదంలో ఇలా చేస్తే నిర్మాత‌ల‌కు డ‌బ్బులు, మీకు ఓట్లు: పేర్ని నానికి ఆర్జీవీ సూచ‌న‌

  • టికెట్ల ధ‌ర‌ల్లో రెండు విధానాల‌ను పాటించాలి
  • నిర్మాత‌లకు ఇష్టం వ‌చ్చిన ధ‌ర‌ల‌కు అమ్ముకోనివ్వండి
  • వారి నుంచి ప్ర‌భుత్వం సినిమా టికెట్లు కొనాలి
  • వాటిని పేద ప్ర‌జ‌ల‌కు త‌క్కువ ధ‌ర‌కు అమ్మాలి
rgv on cinema tickets

ఏపీ ప్ర‌భుత్వం సినిమా టికెట్ల ధ‌ర‌లు త‌గ్గించ‌డంపై ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ స్పందిస్తూ వ‌రుస ట్వీట్లు చేశారు. ప్రియ‌మైన గౌర‌వనీయులైన  ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గారూ అని ప‌దే ప‌దే పేర్కొంటూ, ఆయ‌న‌కు పలు ప్రశ్నలు వేశారు. ఈ ప్ర‌శ్న‌ల‌కు  ఆయ‌న‌ సమాధానం చెప్పాలని ఆర్జీవీ కోరారు.

సినిమాల‌తో పాటు ఏదైనా ఉత్పత్తికి మార్కెట్ ధరను నిర్ణయించడంలో స‌ర్కారు పాత్ర ఎంతమేరకు ఉంటుందని ఆయ‌న ప్ర‌శ్నించారు. గోధుమలతో పాటు బియ్యం, కిరోసిన్, వంటనూనె వంటి స‌రుకుల‌ కొరత ఉన్న స‌మ‌యంలో స‌ర్కారు క‌ల్పించుకుని క‌నిష్ఠ ధ‌ర‌ల‌ను లేదా స‌రైన‌ ధరలను నిర్ణయిస్తాయి అన్నంత వ‌ర‌కు త‌న‌కు తెలుసని ఆర్జీవీ చెప్పారు.

అయితే, ఈ అంశం సినిమా టికెట్ల ధ‌ర‌ల‌కు ఎలా వర్తిస్తుందని ఆయ‌న నిల‌దీశారు. అస‌లు సినిమా టికెట్ల ధరను స‌ర్కారే నిర్ణయించే విధంగా దారి తీసిన పరిస్థితుల గురించి వివ‌రించాల‌ని పేర్ని నానిని కోరారు. రైతులు న‌ష్ట‌పోతోన్న స‌మ‌యంలో వారికి మ‌ద్ద‌తు ధ‌ర ప్ర‌క‌టించి, పంట‌లు వేయ‌డాన్ని ప్రోత్స‌హించిన‌ట్లుగానే సినిమాల్లో న‌ష్టాలు వ‌స్తే కూడా రాయితీలు ఎందుకు ఇవ్వ‌రు? అని ఆయ‌న నిల‌దీశారు.

పేదలకు కూడా సినిమాలు చాలా అవసరమని మీరు భావిస్తే, విద్యా, వైద్య సేవలకు రాయితీ ఇస్తున్నట్లు సినిమాలకీ రాయితీ ఇవ్వాలి కదా? అని ఆయ‌న నిల‌దీశారు. పేద ప్ర‌జ‌ల‌కు బియ్యం, పంచదార అందించడానికి రేషన్‌ షాపులు ఉన్నాయ‌ని, అచ్చం అలాగే రేషన్ సినిమా థియేటర్ల ఏర్పాటును పరిగణనలోకి తీసుకుని అటువంటి ఆలోచనలు చేస్తారా? అని ఆయ‌న ఎద్దేవా చేశారు.

రైతులకు న‌ష్టం క‌లిగించేలా ఆహారధాన్యాల ధరలను బలవంతంగా తగ్గిస్తే వారికి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కదని ఆయ‌న చెప్పారు. అలాగే, వారికి ప్రోత్సాహం లేకపోతే పంట నాణ్యతలో లోపం వ‌స్తుంద‌ని ఆయ‌న చెప్పారు. అదే సూత్రం సినిమాల‌కు కూడా వర్తిస్తుందని ఆయ‌న తెలిపారు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యకు రెండు విధాల టికెట్ల ధ‌ర‌లు నిర్ణ‌యించ‌డ‌మే పరిష్కారంగా కనిపిస్తోందని ఆయ‌న చెప్పారు.

అందులో ఒక‌టి ఏంటంటే, నిర్మాతలు వారు నిర్ణయించిన ధరకు టికెట్లను అమ్మేలా చేస్తార‌ని చెప్పారు. రెండో వాటిలో కొన్నింటిని ప్రభుత్వం కొనుగోలు చేసి తక్కువ ధరకు పేదలకు అమ్ముకోవాల‌ని సూచించారు. ఈ విధానాన్ని పాటిస్తే సినీ నిర్మాతలకు డబ్బులు వ‌స్తాయ‌ని, రాజ‌కీయ నాయ‌కుల‌కు ఓట్లు వస్తాయ‌ని ఆయ‌న చెప్పారు.

ఆడమ్‌ స్మిత్‌ వంటి ఆర్థికవేత్తల సూత్రాల ప్రకారం ప్రైవేటు వ్యాపారాల్లో స‌ర్కారు క‌ల్పించుకోవ‌డం స‌రికాద‌ని ఆయ‌న తెలిపారు. సినిమాలు తీసే అంశంలో అల్లు అర్జున్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మ‌హేశ్ బాబు వంటి హీరోల రెమ్యూనరేషన్‌, సినిమాకు పెట్టిన ఖర్చు వచ్చే రాబడిపై ఆధారపడి ఉంటుందని ఆయ‌న చెప్పారు. అలాగే, ఆ హీరోల ట్రాక్ రికార్డును బ‌ట్టి రాబ‌డి వ‌స్తుంద‌ని తెలిపారు. ఈ విష‌యాల‌ను ఏపీ మంత్రులు అర్థం చేసుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

ఇప్పుడు నోళ్లు మూసుకుంటే అంతే..
సినీ పెద్ద‌ల‌కు కూడా ఆర్జీవీ ఓ సూచ‌న చేశారు. ఇది త‌న విజ్ఞ‌ప్తి మాత్ర‌మే కాదని, సినీ ప‌రిశ్ర‌మ‌లోని త‌న‌ తోటివారి డిమాండ్ కూడా అని తెలిపారు. సినిమా టికెట్ల గురించి మ‌న‌సులో ఏముందో ఆ విష‌యం గురించి మాట్లాడాలని, ఎందుకంటే ఇప్పుడు నోళ్లు మూసుకుంటే ఇంకెప్ప‌టికీ తెర‌వ‌లేరు.. త‌ర్వాత మీ ఇష్టం అని ఆర్జీవీ హెచ్చ‌రించారు.

More Telugu News