Corona Virus: ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా అంతటి ప్రమాదకారి కాదట.. ఎందుకో చెప్పిన అధ్యయనం!

  • ప్రపంచాన్ని చుట్టేసిన ఒమిక్రాన్ వేరియంట్
  • ఎగువ శ్వాసకోశ వ్యవస్థకే పరిమితం
  • ఊపిరితిత్తుల వరకు చేరుకోని ఒమిక్రాన్
  • వైరస్ సంక్రమించినా పెను ప్రమాదం ఉండబోదన్న  శాస్త్రవేత్తలు
Studies suggest why Omicron is less severe

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను కమ్మేసింది. మన దేశంలోనూ ఇది శరవేగంగా వ్యాప్తి చెందుతూ భయపెడుతోంది. గతంలోని డెల్టా వేరియంట్‌‌లానే ఇది కూడా విరుచుకుపడి ప్రాణాలను హరిస్తుందా? దీని వల్ల పెను విపత్తు సంభవించబోతోందా? అన్న ప్రశ్నలకు ఇప్పటి వరకు సరైన సమాధానాలు లేవు. ఈ వేరియంట్ చాలా డేంజరని కొందరంటుంటే, భయపడాల్సింది ఏమీ లేదని మరికొందరు నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద కూడా ఈ వేరియంట్‌పై కచ్చితమైన సమాచారం లేదు.

ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలిన ఫలితాలు ఊరటనిస్తున్నాయి. కరోనాలోని గత వేరియంట్లతో పోలిస్తే ఇది ఏమంత ప్రమాదకారి కాదని అధ్యయన నివేదిక చెబుతోంది. కాబట్టి ఒమిక్రాన్ అంటే భయపడాల్సిందేమీ లేదని చెప్పకనే చెప్పింది. గతంలోని కరోనా వైరస్‌లు ఊపిరితిత్తులపై ప్రభావం చూపించి ఊపిరాడనివ్వకుండా చేసి ప్రాణాలు హరించాయి. అయితే, ఒమిక్రాన్ వల్ల మాత్రం అలాంటి ప్రమాదమేమీ లేదన్న విషయం తాజాగా వెలుగుచూసింది.

ఇది శరీరంలోని పైభాగానికే పరిమితమవుతున్నట్టు గుర్తించారు. ఇది ప్రధానంగా ముక్కు, గొంతు, శ్వాసనాళానికే పరిమితమవుతోందని, ఊపిరితిత్తుల వరకు చేరుకోవడం లేదని ఎలుకలు, చిట్టెలుకలపై నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఒమిక్రాన్ వేరియంట్ ఎగువ శ్వాసకోశ వ్యవస్థకే పరిమితం అవుతోందని బెర్లిన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కంప్యుటేషనల్ బయాలజిస్ట్ రోనాల్డ్ ఈల్స్ తెలిపారు. శ్వాసకోశ వ్యవస్థకు కరోనా వైరస్‌లు ఎలా సంక్రమిస్తాయన్న దానిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్టు తెలిపారు.

అయితే, గత పరిశోధనల ఫలితాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉండడం గమనార్హం. కరోనా వైరస్‌లు కణాలను గట్టిగా పట్టుకుంటాయని, శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ నుంచి కూడా అవి తప్పించుకోగలవని తేల్చాయి. అయితే, ఒకసారి అవి శరీరంలోకి ప్రవేశించాక లోపల ఎలా ప్రవర్తిస్తాయన్నది అంతుబట్టకుండా ఉండిపోయింది.

తాజా పరిశోధన ఫలితాలు మాత్రం ఒమిక్రాన్ వల్ల ఏమంత భయం లేదని, ఆందోళన చెందాల్సిన పని అసలే లేదని తేల్చింది. ఒమిక్రాన్ సోకినప్పటికీ ఊపిరితిత్తులపై ఎలాంటి ప్రమాదం ఉండదు కాబట్టి త్వరగానే దాని బారి నుంచి బయటపడొచ్చని పేర్కొంది. ఒమిక్రాన్ భూతంలా భయపెడుతున్న వేళ తాజా అధ్యయన ఫలితాలు పెద్ద ఊరటే అని చెప్పచ్చు.

More Telugu News