Australia: యాషెస్ సిరీస్: ఆసీస్ చేతిలో ఇంగ్లండ్ ఘోర పరాభవం.. 3-0తో సిరీస్ కైవసం

  • బాక్సింగ్ డే టెస్టులో ఇంగ్లండ్‌కు దారుణ పరాభవం
  • ఇన్నింగ్స్ 14 పరుగుల తేడాతో ఓటమి
  • ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను కకావికలు చేసిన స్కాట్ బోలాండ్
  • రూట్ చేసిన 28 పరుగులే అత్యధికం
Australia won The Ashes Series

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టు (బాక్సింగ్ డే టెస్టు)లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా ఐదో టెస్టు సిరీస్‌ను మరో రెండు టెస్టులు మిగిలి ఉండగానే 3-0తో కైవసం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో దారుణంగా విఫలమవుతున్న ఇంగ్లండ్‌కు ఈ సిరీస్ ఘోర పరాభవాన్ని మిగిల్చింది. రెండో ఇన్నింగ్స్‌లో 68 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్.. ఆసీస్ బౌలర్ల ధాటికి విలవిల్లాడింది.

ఓవర్‌నైట్ స్కోరు 31/4తో మంగళవారం మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ ఏ దశలోనూ క్రీజులో కుదురుకోలేకపోయింది. బ్యాటర్లు క్రీజులోకి వచ్చినట్టే వచ్చి పెవిలియన్ చేరారు. కెప్టెన్ జో రూట్ చేసిన 28 పరుగులే అత్యధికమంటే ఆ జట్టు ఆట తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రూట్ తర్వాత బెన్ స్టోక్స్ చేసిన 11 పరుగులే రెండో అత్యధికం. నలుగురు ఆటగాళ్లు డకౌట్ కాగా, ఐదుగురు బ్యాట్స్‌మెన్ కలిసి చేసిన పరుగులు 24 మాత్రమేనంటే ఆసీస్ బౌలింగ్‌కు ఇంగ్లండ్ ఏ స్థాయిలో వణికిందో అర్థం చేసుకోవచ్చు.

ఇక, ఆసీస్ జట్టులో అరంగేట్ర బౌలర్ స్కాట్ బోలాండ్ బంతులతో నిప్పులు చెరిగాడు. నాలుగు ఓవర్లు వేసి ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. మిచెట్ స్టార్క్ 3 వికెట్లు తీసుకున్నాడు. కాగా, ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 185కు ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 267 పరుగులకు ఆలౌట్ అయింది.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 68 పరుగులకే కుప్పకూలడంతో ఇన్నింగ్స్ 14 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించి సిరీస్‌ను ఎగరేసుకుపోయింది. బంతితో విరుచుకుపడి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను కకావికలు చేసిన స్కాట్ బోలాండ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.

More Telugu News