Balakrishna: యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామిని ద‌ర్శించుకుని.. ఒమిక్రాన్‌పై బాల‌కృష్ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

  • అఖండ సినిమా విజయం సాధించినందుకు యాదాద్రికి సినీ యూనిట్
  • దేవుడి అనుగ్ర‌హం లేనిదే ఏ ఫ‌లితం రాద‌న్న ‌బాలయ్య
  • లోకా స‌మ‌స్తా సుఖినోభ‌వంతు అంటూ ఆకాంక్ష ‌
  • క‌రోనా ప‌రిస్థితుల‌ను త‌ప్పించాల‌ని ప్రార్థ‌న‌
balakrishna on omicron

'అఖండ' సినిమా విజయం సాధించినందుకు సినీ నటుడు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను స‌హా ఆ సినిమా బృందం ఈ రోజు ఉద‌యం యాదాద్రికి వ‌చ్చి స్వామివారిని ద‌ర్శించుకుంది. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసింది. ఆ త‌ర్వాత ఆ సినిమా యూనిట్ ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించింది.

తెలంగాణ‌ సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో యాదాద్రి పునర్నిర్మాణం చేపట్టారని ఈ సంద‌ర్భంగా బాలకృష్ణ ప్రశంసించారు. దేశం గర్వించే స్థాయిలో యాదాద్రి పునర్నిర్మాణం జ‌రుగుతోంద‌ని కొనియాడారు. చరిత్రలో నిలిచిపోయేలా కృష్ణశిలతో ఆలయాన్ని తీర్చిదిద్దిన శిల్పుల ప్ర‌తిభ‌ను మెచ్చుకున్నారు. ఆలయ నిర్మాణంలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్న‌ట్లు వ్యాఖ్యానించారు.

'దేవుడి అనుగ్ర‌హం లేనిదే ఏ ఫ‌లితం రాద‌ని మ‌నంద‌రి న‌మ్మ‌కం. ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామి అనుగ్ర‌హం నాపై ఉంద‌ని ప్ర‌జ‌లూ భావిస్తారు. తెలుగువారు అంద‌రూ బాగుండాలి. అంతేకాదు, ప్ర‌పంచంలోని అంద‌రూ బాగుండాలి. లోకా స‌మ‌స్తా సుఖినోభ‌వంతు. ప్ర‌పంచమంతా బాగుండాలి. ఇప్పుడు చూస్తున్నాం. క‌రోనా మ‌హ‌మ్మారి విప‌త్క‌ర ప‌రిస్థితులు తెచ్చిపెట్టింది. ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్ వ‌చ్చి క‌ల‌వ‌ర‌పెడుతోంది. వీట‌న్నింటినుంచి త‌ప్పించాల‌ని, అలాగే శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడాల‌ని భ‌గవంతుడిని కోరుతున్నాను. నేను చిన్న‌ప్ప‌టి నుంచి వ‌స్తున్నాను ఈ గుడికి' అన్నారు బాల‌కృష్ణ.

కాగా, క‌రోనా స‌మ‌యంలోనూ బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక గ్రాస్‌ వసూళ్లు సాధించిన చిత్రంగా అఖండ నిలిచిన విష‌యం తెలిసిందే. ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా దుమ్ముదులిపేసింది. ఆధ్యాత్మిక‌త‌, ప్ర‌కృతిని దోచుకుంటోన్న‌ మైనింగ్ మాఫియా ఆధారంగా ఈ సినిమాను బోయ‌పాటి తెర‌కెక్కించిన తీరుకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ సినిమా విడుదలై  25 రోజులైంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసిన పంపిణీదారులతో కలిసి అఖండ ఇప్ప‌టికే హైదరాబాద్‌లో విజయోత్సవాన్ని నిర్వహించారు.

More Telugu News