Drugs Case: డ్రగ్స్ కేసు: నకిలీ అధికారుల వేధింపులు తట్టుకోలేక యువనటి ఆత్మహత్య

  • పేరు వెల్లడించకుండా ఉండాలంటే రూ. 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్
  • పదేపదే ఫోన్లు చేసి వేధింపులు
  • ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య
  • ఎన్‌సీబీపై మంత్రి నవాబ్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు
Young Actress suicide after fake NCB Officials Harassment

మాదకద్రవ్యాల కేసులో పేరు వెల్లడించకుండా ఉండాలంటే రూ. 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పదేపదే వేధిస్తుండడంతో తట్టుకోలేని బాలీవుడ్ కు చెందిన ఓ యువనటి (28) ఆత్మహత్య చేసుకుంది. ముంబైలో జరిగిందీ ఘటన.

దీనికి సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాధిత నటి ఈ నెల 20న ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో పార్టీకి వెళ్లింది. అక్కడామెను కలిసిన ఇద్దరు వ్యక్తులు తాము ఎన్‌సీబీ అధికారులమని పరిచయం చేసుకున్నారు. డ్రగ్స్ కేసులో పేరు బయటపెట్టకుండా ఉండాలంటే రూ. 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఆ తర్వాత ఆమెకు పదేపదే ఫోన్ చేస్తూ డబ్బుల కోసం వేధించారు. డబ్బులు ఇవ్వకుంటే పేరు బయటపెట్టేస్తామని బెదిరించారు. వారి వేధింపులు తట్టుకోలేని నటి గురువారం తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం వెలుగులోకి రావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూరజ్ మోహన్ పర్దేశి (38), ప్రవీణ్ కుమార్ వలింబే (35)ను అరెస్ట్ చేశారు.

యువనటి ఆత్మహత్యపై మహారాష్ట్ర మైనారిటీ వ్యవహారాలశాఖ మంత్రి నవాబ్ మాలిక్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. నటి ఆత్మహత్య వెనక ఎన్‌సీబీ ఉందని, డబ్బుల కోసం అదే ప్రైవేటు సైన్యంతో నటిని వేధించిందని ఆరోపించారు.

More Telugu News