telangana: తెలంగాణలో సరికొత్త రికార్డు దిశగా మద్యం విక్రయాలు

  • నెలవారీ విక్రయాల గత గరిష్ఠ రికార్డు రూ.2,800 కోట్లే
  • డిసెంబర్ నెలలో 23 నాటికే రూ.2,320 కోట్ల అమ్మకాలు
  • ఈ నెల మొత్తం మీద రూ.3,000 కోట్లు దాటొచ్చని అంచనా
telangana liquor sales all time high

తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు ఏరులై పారుతున్నాయి. ముఖ్యంగా డిసెంబర్ నెల విక్రయాలు సరికొత్త రికార్డును నమోదు చేయవచ్చని అంచనా. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ మద్యం విక్రయాలు భారీగా నమోదవుతుండడం అధికారులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఒక నెలలో అత్యధికంగా విక్రయాలు రూ.2,800 కోట్లను దాటలేదు. కానీ, ఈ ఏడాది డిసెంబర్ నెలలో 23వ తేదీ నాటికే మద్యం అమ్మకాలు 2,320 కోట్లను దాటేశాయి. ఇంకా ఏడు రోజుల సమయం ఉంది. అందులోనూ నూతన సంవత్సర సంబరాలను పెద్ద ఎత్తున జరుపుకోవడం చూస్తూనే ఉన్నాం. ఆ సమయంలో విందులు, వినోదాల్లో మద్యం వినియోగం పెద్ద ఎత్తున ఉంటుంది.

కనుక డిసెంబర్ నెలకు మద్యం విక్రయాలు రూ.3,000 కోట్లను దాటిపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే నిత్యం సుమారు రూ.100 కోట్ల మద్యాన్ని తెలంగాణ ప్రజలు వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రూపేణా ప్రభుత్వానికి ఆదాయం దండిగా సమకూరనుంది. తెలంగాణ ఏర్పడిన మొదటి సంవత్సరంలో మద్యం విక్రయాల రూపంలో ప్రభుత్వానికి రూ.10,833 కోట్లు సమకూరింది. అది కాస్తా 2020-21 సంవత్సరంలో రూ.27,888 కోట్లకు పెరిగిపోవడం గమనార్హం.

More Telugu News