anand mahindra: ఆ కారు నాకు ఇచ్చేయ్.. నీకు సరికొత్త బొలెరో ఇస్తా: సామాన్యుడికి ఆనంద్ మహీంద్రా ఆఫర్

  • పాత, తుక్కు సామానుతో చిన్న జీప్ తయారీ
  • మహారాష్ట్రకు చెందిన సామాన్యుడి విజయం
  • ఆనంద్ మహీంద్రా దృష్టిలో పడిన ఆవిష్కరణ
  • తమకు స్ఫూర్తినిస్తుందంటూ ట్వీట్
anand mahindra offered bolero to common man with impressed his invention

ఓ సామాన్యుడు.. తన కుమారుడు అడిగిన శక్తికి మించిన కోరికను తీర్చేందుకు పడిన తపన.. అన్వేషణ, శ్రమ ఓ వినూత్నమైన వాహన ఆవిష్కారానికి దారితీసింది. పాత, తుక్కు సామానును సేకరించి, రూపొందించిన ఓ చిన్న నాలుగు చక్రాల వాహనం కుమారుడి సంతోషాన్నే కాదు.. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ యజమాని ఆనంద్ మహీంద్రా మనసునూ గెలుచుకుంది.

మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా కడేగావ్ కు చెందిన దత్తాత్రేయ కులవృత్తితో జీవనం సాగిస్తున్న అతి సామాన్యుడు. ఒకరోజు అతడి కుమారుడు ‘నాన్నా, మనం కారు కొనుక్కొందాం’ అని అడిగాడు. కనీసం పాత కారును కొనే స్తోమత కూడా లేకపోవడంతో అతడు విడిభాగాలను, ఇతర మెటీరియల్ ను తుక్కు సామాను విక్రయించే కేంద్రాల నుంచి సేకరించి తానే సొంతంగా ఒక కమాండర్ జీప్ ను పోలిన కారును తయారు చేశాడు.

ఎడమవైపు స్టీరింగ్ తో ఉండే ఈ బుల్లి జీప్ ఇంజన్ కు స్కూటర్ మాదిరే కిక్ రాడ్ తో స్టార్ అయ్యే ఏర్పాటు చేశాడు దత్తాత్రేయ. ఈ వాహనం నిమిషానికి 45 కిలోమీటర్ల వేగంతో నడుస్తూ, లీటర్ పెట్రోల్ కు 40 కిలోమీటర్ల మైలేజీ ఇస్తోందట. కార్లలో ఏదీ కూడా ఇంత మైలేజీనివ్వదు.

ఈ ఆవిష్కరణ ఏదోలా ఆనంద్ మహీంద్రా దృష్టికి వెళ్లింది. ఇంకేముంది.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘‘నిబంధనలకు అనుగుణంగా ఈ వాహనం లేదు కనుక స్థానిక అధికారులు ఇప్పుడో, లేదా తర్వాతే దీన్ని నిలిపివేస్తారు. నేను వ్యక్తిగతంగా అడుగుతున్నాను.. అతడు తన కారును నాకిస్తే కొత్త బొలెరో ఇస్తాను. అతడి ఆవిష్కరణను మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో ప్రదర్శిస్తాం. అది మాకు స్ఫూర్తిగా నిలుస్తుంది. సమృద్ధి వనరులు అంటే అర్థం.. తక్కువ వనరులతోనే ఎక్కువ ఆవిష్కరణ చేయడం అని’’ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

ఈ కారును దత్తాత్రేయ కుటుంబం ఆస్వాదిస్తున్న వీడియోను ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

More Telugu News