Piyush Goyal: రైతుల వద్ద కేంద్రం గురించి కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: పియూష్ గోయల్

  • ధాన్యం కొనుగోళ్లపై పియూష్ గోయల్, కిషన్ రెడ్డి ప్రెస్ మీట్
  • రా రైస్ ఎంతైనా కొనుగోలు చేస్తామని పునరుద్ఘాటన
  • తెలంగాణ నుంచి అధికంగా ధాన్యం సేకరించినట్టు వెల్లడి
Union Minister Piyush Goyal press meet

కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పియూష్ గోయల్ ధాన్యం కొనుగోళ్ల అంశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. రా రైస్ కొనుగోళ్లపై రైతుల వద్ద కేంద్రం గురించి కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రా రైస్ ఎంతైనా కొనుగోలు చేస్తామని కేంద్రం గతంలోనే చెప్పిందని అన్నారు. ఉప ఎన్నికల ఫలితాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు సమస్యలు సృష్టిస్తున్నారని విమర్శించారు.

తెలంగాణ నుంచి గతం కంటే మూడు రెట్లు అధికంగా ధాన్యం సేకరించామని వెల్లడించారు. రైతులకు చెల్లించే ధర కూడా 1.5 రెట్లు పెంచామని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి రబీలో రావాల్సిన 27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటికీ రాలేదని పియూష్ గోయల్ తెలిపారు. తెలంగాణ నుంచి ఉప్పుడు బియ్యం సేకరణకు కొంత వెసులుబాటు ఇచ్చామని అన్నారు. ఈ అవకాశం కేవలం తెలంగాణ రాష్ట్రానికే ఇచ్చామని స్పష్టం చేశారు.

మరో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి పియూష్ గోయల్ నేడు మీడియా సమావేశం నిర్వహించారు. కిషన్ రెడ్డి స్పందిస్తూ... ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సీఐ) కు ఇవ్వాల్సిన బియ్యాన్ని రాష్ట్రం ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేతకానితనం వల్లే రబీ లక్ష్యాలు పూర్తికాలేదని విమర్శించారు. ధాన్యం సేకరణ మొత్తం ఖర్చు కేంద్రానిదే అని, రబీ, ఖరీఫ్ లో ఎంత రా రైస్ ఇచ్చినా తీసుకుంటామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

More Telugu News