AP CID: సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులపై ఉపేక్షించేది లేదు: ఏపీ సీఐడీ

  • ఇటీవల టీఎన్ఎస్ఎఫ్ సోషల్ మీడియా సమన్వయకర్త అరెస్ట్
  • సీఎం ప్రసంగాన్ని మార్ఫింగ్ చేశాడని ఆరోపణలు
  • అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్న సీఐడీ
  • డబ్బులు ఇచ్చి ప్రోత్సహించేవారిపైనా చర్యలుంటాయని వెల్లడి
AP CID warns about wrong posts in Soical Media

ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీ స్పందించింది. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతూ, అసత్య ప్రచారాలు చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. మార్ఫింగ్ ఫొటోలు పోస్టు చేసినా, దుష్ప్రచారం చేసేవారికి డబ్బులు ఇచ్చి ప్రోత్సహించినా శిక్ష తప్పదని పేర్కొంది.

ప్రభుత్వాన్ని, మహిళలను, గౌరవప్రదమైన పదవుల్లో ఉన్నవారి పట్ల సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని అమర్యాదకరంగా ప్రవర్తిస్తే చర్యలు ఉంటాయని ఏపీ సీఐడీ వెల్లడించింది. సోషల్ మీడియాలో పోస్టులను, వీడియోలను, ఇతరుల వ్యాఖ్యలను షేర్ చేసేముందు పరిశీలన చేయాలని, అది నిజమో కాదో నిర్ధారణ చేసుకోవాలని సీఐడీ హితవు పలికింది. ఘర్షణలు రేకెత్తించే పోస్టులకు దూరంగా ఉండాలని సూచించింది.

 టీడీపీ అనుబంధ టీఎన్ఎస్ఎఫ్ సోషల్ మీడియా సమన్వయకర్త సంతోష్ ను సీఐడీ అధికారులు తాజాగా రాజమండ్రిలో అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. సీఎం జగన్ మాట్లాడిన ఓ వీడియోను సంతోష్ మార్ఫింగ్ చేశారని, సీఎం ప్రసంగాన్ని అభ్యంతరకర రీతిలో మార్చివేశారని సంతోష్ పై సీఐడీ ఆరోపిస్తోంది.

More Telugu News