Punjab and Haryana High Court: కొన్ని రోజులపాటు కలిసి ఉన్నంత మాత్రాన అది సహజీవనం అనిపించుకోదు: పంజాబ్, హర్యానా హైకోర్టు

  • పెద్దల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించిన ప్రేమ జంట
  • సహజీవనం వెనక బోల్డన్ని బాధ్యతలు కూడా ఉంటాయన్న కోర్టు
  • పిటిషన్ దాఖలు చేసిన ప్రేమ జంటకు రూ. 25 వేల జరిమానా
Few days of co living may not be enough for live in relation said high court

సహజీవనం విషయంలో పంజాబ్, హర్యానా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కొన్ని రోజులపాటు కలిసి ఉన్నంత మాత్రాన అది సహజీవనం అనిపించుకోదని స్పష్టం చేసింది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ ఓ ప్రేమ జంట వేసిన పిటిషన్‌ను తిరస్కరించిన న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు, ఆ జంటకు రూ. 25 వేల జరిమానా కూడా విధించింది.

కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని యమునానగర్‌ జిల్లాకు చెందిన 18 ఏళ్ల యువతి, 20 ఏళ్ల యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు వీరి ప్రేమను నిరాకరించారు. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన ఈ జంట గత నెల (నవంబరు) 24 నుంచి ఓ హోటల్ గదిలో ఉంటున్నారు. అనంతరం తమ పెద్దల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.

అమ్మాయి తల్లిదండ్రుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, అమ్మాయిపై తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారని యువకుడు ఆ పిటిషన్‌లో ఆరోపించాడు. అయితే, ఈ ఆరోపణలు నమ్మశక్యంగా లేవని హైకోర్టు జడ్జి జస్టిస్ మనోజ్ బజాజ్ పేర్కొన్నారు. సహజీవనం అంటే కొన్ని రోజులు కలిసి ఉండడం కాదని, దాని వెనక మరెన్నో బాధ్యతలు కూడా ఉంటాయని గుర్తు చేశారు. ఇలాంటి పిటిషన్ దాఖలు చేసిన ప్రేమ జంటకు రూ. 25 వేల జరిమానా విధించారు.

More Telugu News