Madhya Pradesh: ఉద్యోగులపై విరుచుకుపడిన గ్వాలియర్ జిల్లా కలెక్టర్.. ఉరితీస్తానని హెచ్చరిక, వీడియో వైరల్!

  • ఉద్యోగులతో సమావేశంలో పాల్గొన్న కలెక్టర్
  • వ్యాక్సినేషన్ విషయంలో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారని ఆగ్రహం
  • టీకాలు తీసుకోవాలంటూ ప్రజల ఎదుట సాష్టాంగ పడాలని సూచన
  • ఏం చేసైనా టీకా తీసుకునేలా చేయాలని సూచన
  • వైరల్ అయిన వీడియోపై కలెక్టర్ వివరణ
Gwalior collector Kaushlendra Vikram Singh Warns Employees

వ్యాక్సినేషన్ విషయంలో నిర్దేశించిన లక్ష్యాలను అందుకోవడంలో విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ కలెక్టర్.. ఉరితీస్తానంటూ ఉద్యోగులను హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లా కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ ఈ హెచ్చరిక చేశారు. భితర్వాల్ రెవెన్యూ కార్యాలయంలో మొన్న నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్ లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమయ్యారని ఉద్యోగులపై మండిపడ్డారు.

వ్యాక్సినేషన్ విషయంలో ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకూడదన్నారు. అదే జరిగితే ఉరితీస్తానని హెచ్చరించారు. అందరికీ టీకాలు అందాలని, ప్రజల వద్దకు వెళ్లి టీకాలు తీసుకోమని సాష్టాంగ పడాలని సూచించారు. రోజంతా వారి ఇళ్ల ముందు వేచి చూడాలన్నారు. వారిని ప్రోత్సహించాలని చెప్పిన కలెక్టర్.. ఏదో ఒకటి చేసి వారు టీకా తీసుకునేలా చేయాలని అన్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తాను అలా అనలేదని, సస్పెండ్ చేస్తానని, చర్యలు తీసుకుంటానని మాత్రమే అన్నానని కలెక్టర్ కౌశలేంద్ర వివరణ ఇచ్చారు.

More Telugu News