Allu Arjun: నాకు అత్యంత విలువైన ఆస్తి అదే: అల్లు అర్జున్

  • హైదరాబాదులో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్
  • చివరిగా ప్రసంగించిన అల్లు అర్జున్
  • డిసెంబరు 17న పుష్ప రిలీజ్
  • అఖండ చిత్రం కిక్ ఇచ్చిందని వెల్లడి
  • అన్ని సినిమాలు ఆదరించాలని పిలుపు
Allu Arjun speech at Pushpa pre release event

పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో అల్లు అర్జున్ చివరిగా ప్రసంగించారు. చిత్తూరు యాసలో స్పీచ్ మొదలుపెట్టిన అల్లు అర్జున్ ఏందబ్బా ఈ రచ్చ అంటూ అభిమానులను హుషారెత్తించారు. తన జీవితంలో అత్యంత విలువైన ఆస్తి ఏదైనా ఉందంటే అది మీ అభిమానమే అంటూ ఫ్యాన్స్ నుద్దేశించి వ్యాఖ్యానించారు.

పుష్ప చిత్రంలో సంగీతం అదిరిపోతుందని అన్నారు. ఇవాళ కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పనులతో బిజీగా ఉన్న సుకుమార్... ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా రాలేదని, దాన్నిబట్టే సినిమాపై ఆయనకు ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతుందని అన్నారు. ఇది రెండేళ్ల కష్టమని అన్నారు. అందుకు ఎంతోమందికి కృతజ్ఞతలు చెప్పాలని అన్నారు. ఈ సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలకు అద్భుతమైన రీతిలో స్పందన వస్తోందని, ఒక్కో పాట ఒక్కో ప్రభంజనంలా దూసుకుపోతున్నాయని, లిరిక్ రైటర్ చంద్రబోస్ విభిన్న తరహాలో పాటలు రాశారని కొనియాడారు.

దేవి శ్రీ ప్రసాద్, తాను, సుకుమార్ దాదాపు ఒకేసారి జర్నీ ప్రారంభించామని, ఇవాళ దేవి భాగస్వామ్యం లేకుండా తాను లేనని వినమ్రంగా పేర్కొన్నారు. ఈ సినిమాలో పలు ఆసక్తికరమైన క్యారెక్టర్లు ఉన్నాయని, అందరినీ ఆకట్టుకునేలా నటించారని, ముఖ్యంగా సునీల్ మంగళం శీను పాత్రలో ఒదిగిపోయారని కితాబిచ్చారు. దాక్షాయణిగా అనసూయ కూడా ఆకట్టుకుంటుందని చెప్పారు. నాలుగు సినిమాలకు పడిన కష్టాన్ని ఈ ఒక్క సినిమా కోసం పడ్డానని, మైత్రీ మూవీ మేకర్స్ సహకారం ఎనలేనిదని కొనియాడారు.

"నాకు చాలా ఆనందం కలిగించే విషయం ఏంటంటే... ఈ సినిమా ద్వారా మా మామయ్యలు కూడా చిత్రరంగంలోకి ప్రవేశిస్తున్నారు. ముత్తంశెట్టి మీడియా అనే సంస్థ ఏర్పాటు చేయించి వారిని కూడా పుష్ప చిత్ర నిర్మాణంలో భాగస్వాములను చేశాను. నేను వాళ్ల వద్ద పెరిగిన రోజుల్లో మా మామయ్యలు ఎంతో ప్రేమ చూపించారు. ఇవాళ వాళ్లపై నేను ప్రేమ చూపించే అవకాశం దక్కింది" అని వివరించారు.

దర్శకుడు సుకుమార్ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావడంలేదన్న విషయం తనకు చివరి నిమిషంలో తెలిసిందని, దాంతో అతడిని ఎలాగైనా ఒప్పించి వేడుకకు రప్పించాలని ఫోన్ చేశానని బన్నీ వెల్లడించారు. అయితే, సుకుమార్ తో పది నిమిషాలు మాట్లాడిన తర్వాత అతడే తనను ఒప్పించాడని తెలిపారు. చివరి సీన్ వరకు అలరించే అద్భుతమైన సినిమా వస్తుందని అందరికీ చెప్పు అంటూ నన్ను ఈవెంట్ కు పంపించాడని బన్నీ వివరించారు.

చివరిగా అల్లు అర్జున్ అఖండ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. తాను ఈ విషయాన్ని సోషల్ మీడియాలో చెప్పొచ్చని, కానీ ఈ వేదికపై చెప్పడానికి కారణం అఖండ సినిమా చిత్ర పరిశ్రమకు ఎంతో ఊపునిచ్చిందని పేర్కొన్నారు. చాలా రోజుల తర్వాత ఒక వ్యక్తి వచ్చి మ్యాచ్ ఆడి ఫస్ట్ బాల్ నే సిక్స్ కొడితే ఎంత కిక్ వస్తుందో... బాలయ్య అఖండ చిత్రంతో అంత కిక్ వచ్చిందని వెల్లడించారు.

ఇదే ఒరవడి ఇకపైనా కొనసాగాలని కోరుకుంటున్నామని, డిసెంబరు 17న పుష్ప వస్తోందని, ఆ తర్వాత నాని శ్యామ్ సింగరాయ్, ఆ తర్వాత ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, ఆచార్య వంటి సినిమాలు వస్తున్నాయని, అన్ని సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలని పిలుపునిచ్చారు. హీరో ఎవరైనా అంతిమంగా సినిమా గెలవాలని ఆకాంక్షించారు.

More Telugu News