Mountaineer: గతంలో ఫ్రాన్స్ లో కూలిన భారత విమానాలు.... పర్వాతారోహకుడికి కలిసొచ్చిన అదృష్టం

  • 1950, 1966లో కూలిన ఎయిరిండియా విమానాలు
  • మౌంట్ బ్లాంక్ వద్ద ఘటనలు
  • 2013లో పర్వతారోహకుడికి దొరికిన విలువైన రాళ్లు
  • నిజాయతీగా ఫ్రాన్స్ ప్రభుత్వానికి అప్పగించిన వైనం
  • తాజాగా ఆ రాళ్లను రెండు వాటాలుగా చేసిన ఫ్రాన్స్
  • ఓ వాటా పర్వతారోహకుడికి అప్పగింత
France gifted a mountaineer precious stones which he found on Mount Blonc

గతంలో భారత్ కు చెందిన రెండు ఎయిరిండియా విమానాలు ఫ్రాన్స్ భూభాగంపై కూలిపోయాయి. ఒకటి 1950లో, మరొకటి 1966లో ఫ్రాన్స్ లోని మౌంట్ బ్లాంక్ మంచు పర్వతంపై కూలిపోయాయి. 1966లో జరిగిన విమాన ప్రమాదంలో 117 మంది మృత్యువాతపడ్డారు. మరణించిన వారిలో భారత అణుశక్తి పితామహుడు హోమీ జహంగీర్ బాబా కూడా ఉన్నారు.

అయితే, నాటి నుంచి అనేకమంది పర్వతారోహకులు మౌంట్ బ్లాంక్ ను అధిరోహించే క్రమంలో ఈ రెండు విమానాల శకలాలను కూడా పరిశీలించేవారు. వారిలో ఓ పర్వాతారోహకుడిని అనుకోని రీతిలో అదృష్టం వరించింది. 2013లో అతడు మౌంట్ బ్లాంక్ పర్వతాన్ని అధిరోహించాడు. ఆ సమయంలో విమాన శకలాల వద్దకు వెళ్లగా, అక్కడ ఓ లోహపు పెట్టె కనిపించింది.

ఆ పెట్టెలో ఎంతో విలువైన మణి, మాణిక్యాలు, వైఢూర్యాలు ఉన్నాయి. అయితే వాటిని ఆ పర్వతారోహకుడు నిజాయతీగా పోలీసులకు అప్పగించాడు. ఇన్నాళ్లకు అతడిని నిజాయతీకి తగిన ప్రతిఫలం లభించింది.

తమకు అప్పగించిన విలువైన రాళ్లను ఫ్రాన్స్ ప్రభుత్వం రెండు వాటాలగా విభజించింది. ఓ వాటాను ఆ పర్వాతారోహకుడికి ఇచ్చివేశారు. దాంతో ఆ పర్వతారోహకుడి ఆనందం అంతాఇంతా కాదు. వాటి విలువ తెలుసుకుని ఉబ్బితబ్బిబ్బయిపోతున్నాడు. ఒక్కో రాయి భారత కరెన్సీలో 1.28 కోట్లు ఉంటుందని అంచనా. దీనిపై అతడు స్పందిస్తూ, విలువైన రాళ్లు లభ్యమైన ఘటనకు ఇలాంటి ముగింపు లభించడం తనను ఎంతో సంతోషానికి గురిచేస్తోందని వెల్లడించాడు.

More Telugu News