CDS: సీడీఎస్ రావత్​ కు తుది వీడ్కోలు.. వీరుడా వందనమంటూ 50 కిలోమీటర్లమేర బారులు తీరిన తమిళ ప్రజలు.. ఇదిగో వీడియో

  • మెట్టుపాల్యం నుంచి సూలూరు ఎయిర్ బేస్ దాకా మానవ హారం
  • సైనికుల అంబులెన్సులపై పూలు చల్లుతూ నివాళులు
  • భావోద్వేగ భరిత పోస్టు పెట్టిన ఇండియన్ ఆర్మీ
Tamil Public Pays a huge Tribute to CDS Bipin Rawat by forming 50 km human chain

సీడీఎస్ (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) బిపిన్ రావత్ కు తమిళ ప్రజలు ఘన నివాళులర్పించారు. రావత్ తో పాటు మరణించిన సైనికుల మృతదేహాలను అధికారులు తరలించే క్రమంలో జనమంతా బారులు తీరారు. 50 కిలోమీటర్ల మేర మానవ హారంగా నిలిచారు. నిన్న వీర సైనికుల మృతదేహాలను ఢిల్లీలోని పాలం ఎయిర్ బేస్ కు తరలించే క్రమంలో.. తొలుత కూనూరు నుంచి సూలూరు ఎయిర్ బేస్ కు వారి మృతదేహాలను తీసుకెళ్లారు.


ఆ సమయంలో మెట్టుపాల్యం నుంచి సూలూరు వరకు 50 కిలోమీటర్ల వరకు జనం రోడ్డుకు ఇరువైపులా నిలబడ్డారు. అంబులెన్సులపై పూలు చల్లుతూ నివాళులర్పించారు. వీర వణక్కం (వీరుడా వందనం) అంటూ చివరి వీడ్కోలు పలికారు. దానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. రెండు రోజుల క్రితం కూనూరులో ప్రసంగం ఇవ్వడం కోసం వెళ్లిన రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు భార్య మధులిక, మరో 11 మంది సైనికులు చనిపోయారు.

రావత్ మరణం పట్ల ఆర్మీ భావోద్వేగభరిత పోస్టును పెట్టింది. ‘‘మన జెండా రెపరెపలాడేది గాలి వీయడం వల్ల కాదు.. దానిని కాపాడే క్రమంలో అమరులైన ప్రతి సైనికుడి చివరి శ్వాసతో ఎగురుతుంది’’ అంటూ నివాళులర్పించింది. భరతమాత కన్న ధీశాలికి నివాళులర్పించేందుకు ఓ లింకును పోస్ట్ చేసింది. generalbipinrawattributes.in వెబ్ సైట్ లో నివాళులర్పించొచ్చని పేర్కొంది.

కాగా, అమూల్ కూడా తనదైన శైలిలో కార్టూన్ తో సీడీఎస్ రావత్ కు ఘన నివాళి అర్పించింది. సైనిక ఖడ్గంతో నడుచుకుంటూ వస్తున్నట్టుగా రావత్ కార్టూన్ ను చిత్రించింది. ‘‘ప్రతి సైనికుడికీ ఆత్మీయుడాయన.. శత్రువుల పాలిట మృత్యు ఖడ్గం ఆయన’’ అని పేర్కొంటూ ట్వీట్ చేసింది.
 

More Telugu News