Ashes Test: యాషెస్ టెస్టులో అపురూప దృశ్యం.. ఆస్ట్రేలియా గాళ్ ఫ్రెండ్‌కు ఇంగ్లండ్ ఫ్యాన్ ప్రపోజల్.. హోరెత్తిపోయిన స్టేడియం!

  • లవ్ ప్రపోజల్‌కు తొలుత ఆశ్చర్యపోయిన యువతి
  • ఆ వెంటనే అంగీకారం
  • చుంబనాలు, ఆలింగనాలు
  • హోరెత్తిపోయిన స్టేడియం
Ashes fan proposes to girlfriend during first Test at the Gabba video goes viral

ఈఫిల్ టవర్ ముందు చేసే లవ్ ప్రపోజల్స్‌ను ఇప్పటి వరకు ఐకానిక్‌గా పరిగణించేవారు. కానీ, ఇప్పుడు క్రీడా ప్రేమికులు తమ అభిమాన జట్టు ఆటను వీక్షిస్తూ స్టేడియంలోనే ప్రపోజ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇలాంటివి ఇటీవల తరచుగా వెలుగు చూస్తున్నాయి.

తాజాగా అలాంటి ఘటనే ఒకటి బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో జరిగింది. అయితే, ఇది కొంచెం డిఫరెంట్. ప్రత్యర్థి జట్ల అభిమానులైన ఇద్దరు ప్రపోజ్ చేసుకోవడం, స్టాండ్స్‌లో ఉన్న ఫ్యాన్స్ వారిని ప్రోత్సహించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలను చుట్టేస్తోంది.

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య  ఇక్కడ తొలి టెస్టు జరుగుతోంది. మూడో రోజైన నేడు ఇంగ్లండ్‌కు చెందిన ఓ యువకుడు ఆస్ట్రేలియా గాళ్ ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేశాడు. మొదట అతడి వంక ఆశ్చర్యంగా చూసిన అమ్మాయి.. అనుమతి ఇచ్చేందుకు ఎక్కువ సమయం ఏమీ తీసుకోలేదు. ఆ వెంటనే ముద్దులు, కౌగిలింతలతో స్టేడియం హోరెత్తిపోయింది. మ్యాచ్‌ను చిత్రీకరిస్తున్న కెమెరాలు ఒక్కసారిగా అటువైపు తిరిగాయి. స్టాండ్స్‌లోని అభిమానులు కూడా వారిని మరింత ఉత్సాహపరిచారు. కరతాళ ధ్వనులతో వారికి శుభాకాంక్షలు తెలిపారు.
 
 ఇక్కడ ఇంకో విషయం గురించి కూడా చెప్పుకోవాలి. యాషెస్ సందర్భంగా గబ్బాలో ఇలాంటి ప్రపోజల్ రావడం ఇదే తొలిసారి కాదు. 2017లోనూ ఓ జంట ఇలానే ప్రపోజ్ చేసుకుని తమ ప్రేమను మరో మెట్టు ఎక్కించారు.  

 తాజా విషయానికి వస్తే మైఖేల్ అనే యువకుడు మోకాళ్లపై కూర్చుని టోరీ అనే యువతిని పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. ఆ దృశ్యాన్ని చూసి ఆమె క్షణకాలం పాటు నమ్మలేకపోయింది. ఆ వెంటనే తేరుకుని ఓకే చెప్పడంతో అతడి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. వెంటనే తన చేతిలో ఉన్న ఉంగరాన్ని ఆమె చేతికి తొడిగాడు. వారి చుట్టూ ఉన్న అభిమానులు కూడా వారిని మరింత ఉత్సాహ పరచడంతో స్టాండ్స్ కేరింతలతో దద్దరిల్లింది.  

ఇక, మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగుల స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయింది. హసీబ్ హమీద్ (25), ఒల్లీ పోప్ (35), జోస్ బట్లర్ (39), క్రిస్ వోక్స్ (21) మినహా మిగతా వారిలో ఎవరూ రెండంకెల స్కోరు కూడా సాధించలేకపోయారు. ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 425 పరుగులకు ఆలౌట్ అయింది. ట్రావిస్ హెడ్ ఇంగ్లండ్ బౌలర్లను దంచికొట్టి 152 పరుగులు సాధించగా, ఓపెనర్ వార్నర్ 94 పరుగులు చేసి ఆరు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది.

More Telugu News