Tamil Nadu: ప్రియుడిపై ఫిర్యాదు చేసేందుకు వెళితే, అత్యాచారం చేసిన ఎస్సై, ఆపై అబార్షన్.. కేసుల నమోదు!

  • తమిళనాడులోని కన్యాకుమారిలో ఘటన
  • ప్రియుడి చేతిలో మోసపోయి పోలీస్ స్టేషన్‌కు
  • సాయం చేస్తున్నట్టు నమ్మించి పలుమార్లు అత్యాచారం
  • కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసి దర్యాప్తు
SI Raped women in the name of help in tamilnadu

ప్రేమికుడి చేతిలో మోసపోయిన ఓ మహిళ ఫిర్యాదు చేసేందుకు వెళితే, ఎస్సై ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె గర్భం దాల్చినట్టు తెలియడంతో పరీక్షల పేరుతో అబార్షన్ చేయించాడు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కళియకోవిలై పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి తాజాగా 8 మందిపై కేసు నమోదైంది.

పోలీసుల కథనం ప్రకారం..  స్థానికంగా నివసించే ఓ మహిళ (32)కు వివాహమైంది. ఆమెకు తొమ్మిదేళ్ల కుమార్తె కూడా ఉంది. ఆ తర్వాత ఆమె భర్త నుంచి విడాకులు తీసుకొని ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే, ఆ తర్వాత అతడు మోసం చేయడంతో ఫిర్యాదు చేసేందుకు పళుగల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.

అక్కడామెకు సాయం చేసే నెపంతో అప్పటి సబ్ ఇన్‌స్పెక్టర్ సుందరలింగం (40) బాధితురాలిని పలుచోట్లకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె గర్భం దాల్చినట్టు తెలిసి ఓ క్లినిక్‌కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయిస్తున్నట్టు నమ్మించి అబార్షన్ చేయించాడు. ఈ ఘటనపై ఆమె పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. డీఎస్పీ, ఎస్పీలను కలిసి న్యాయం చేయాల్సిందిగా కోరింది.

 అయినప్పటికీ ఆమెకు నిరాశే ఎదురైంది. దీంతో కోర్టును ఆశ్రయించగా బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడిన సుందరలింగం, అబార్షన్ చేసిన డాక్టర్ కార్మల్ రాణి (38) సహా 8 మందిపై కేసులు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News