Nagaland: నాగాలాండ్‌లో భద్రతా దళాల పొరపాటు.. మిలిటెంట్లుగా భావించి పౌరులపై కాల్పులు.. 13 మంది మృతి

  • బొగ్గు గని కార్మికులపై భద్రతా దళాల కాల్పులు
  • మరో 11 మందికి తీవ్రగాయాలు
  • ఆగ్రహించిన కార్మికులు
  • భద్రతా దళాల వాహనాలకు నిప్పు
13 civilians killed by security forces in Nagaland

నాగాలాండ్‌లో భద్రతా దళాలు పొరపాటు పడ్డాయి. మిలిటెంట్లుగా భావించి జరిపిన కాల్పుల్లో 13 మంది పౌరులు మరణించగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. నిన్న సాయంత్రం మోన్ జిల్లా ఓటింగ్‌లో జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా దళాల కాల్పుల్లో మరణించిన వారందరూ బొగ్గు గని కార్మికులుగా గుర్తించారు. వారు విధులు ముగించుకుని వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

మిలిటెంట్ల కదలికలు ఉన్నట్టు సమాచారం అందుకున్న భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. అదే సమయంలో పనులు ముగించుకుని వస్తున్న కార్మికులను మిలిటెంట్లుగా పొరబడిన భద్రతా దళాలు ఒక్కసారిగా కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన 11 మందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనతో ఆగ్రహించిన స్థానికులు భద్రతా దళాల వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పౌరుల మృతిపై నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయ్‌ప్యూ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ‘సిట్‌’తో దర్యాప్తు చేయిస్తామన్నారు.

More Telugu News