Taliban: తాలిబన్లు మారిపోయారా?.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న తాలిబన్ల తాజా నిర్ణయం!

  • బలవంతపు పెళ్లిళ్లపై తాలిబన్ల నిషేధం
  • ఉలంఘిస్తే కఠిన చర్యలు
  • భర్త కోల్పోయిన మహిళ తన ఇష్టప్రకారం భర్తను ఎంచుకునే అవకాశం
  • తాలిబన్లపై ప్రశంసలు
Taliban bans forced marriage of women in Afghanistan

చూస్తుంటే తాలిబన్ల వైఖరిలో మార్పు వచ్చినట్టే కనిపిస్తోంది. మహిళలను ఆటబొమ్మలుగా పరిగణించే తాలిబన్లు తాజాగా తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మహిళ అనుమతి లేకుండా పెళ్లిళ్లు చేయడం నేరమంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. బలవంతపు పెళ్లిళ్లను నిషేధిస్తున్నట్టు తెలిపారు. స్త్రీలను ఆస్తిగా పరిగణించకూడదని స్పష్టం చేశారు. స్త్రీపురుషులిద్దరూ సమానమేనని పేర్కొన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ తాలిబన్ అధిపతి హిబతుల్లా అఖుంద్‌జా పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.

పేదరికం కారణంగా ఆఫ్ఘనిస్థాన్‌లో బలవంతపు పెళ్లిళ్లు సర్వసాధారణంగా మారాయి. అప్పుకింద అమ్మాయిలను చెల్లించడం, విక్రయించడం అక్కడ అనాదిగా వస్తోంది. అంతేకాదు, అక్కడి గిరిజన తెగల్లోని మహిళలు భర్త చనిపోతే అతడి అన్నదమ్ముల్లో ఒకరిని చేసుకోవాలన్న నియమం కూడా ఉంది. తాజాగా, తాలిబన్లు జారీ చేసిన ఆదేశాలతో వీటన్నింటికీ చెక్ పడనుంది. అంతేకాదు, భర్తను కోల్పోయిన మహిళ 17 వారాల తర్వాత తన ఇష్ట ప్రకారం నచ్చిన వ్యక్తిని పెళ్లాడే స్వేచ్ఛ ఇస్తున్నట్టు కూడా తాలిబన్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం.

నిజానికి ఆప్ఘనిస్థాన్ తిరిగి తాలిబన్ల వశమయ్యాక ఎక్కువగా భయపడింది ఆ దేశంలోని మహిళలే. వారిపై కఠిన ఆంక్షలు ఉంటాయని అందరూ భావించారు. అణచివేత, వేధింపులు తప్పవని భయపడిపోయారు. దీంతో చాలామంది దేశం విడిచి పారిపోయారు కూడా. అయితే, అందరినీ ఆశ్చర్యపరుస్తూ తాలిబన్లు మహిళల బలవంతపు వివాహాలపై కఠిన వైఖరి అవలంబించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వారిలో ఈ ఉదారవాద వైఖరిని ఊహించని ప్రపంచం వారి నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తోంది. అయితే, తాలిబన్ల నిర్ణయం వెనక అంతర్జాతీయ ఒత్తిడి ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

More Telugu News