Ilayaraja: ఆయన పదముద్రలు నా హార్మోనియం మెట్లపై నాట్యం చేశాయి: ఇళయరాజా

  • సిరివెన్నెలది, నాది ఎన్నో ఏళ్ల ప్రయాణం
  • మా ఇద్దరి కలయికలో ఎన్నో పాటలు ప్రాణం పోసుకున్నాయి
  • పాట కోసమే బ్రతికాడు, బ్రతికినంత కాలం పాటలే రాశాడు
Ilayaraja response on Sirivennela death

సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిపై ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఆవేదన వ్యక్తం చేశారు. తమది ఎన్నో ఏళ్ల ప్రయాణమని ఆయన అన్నారు. వేటూరి సుందర రామమూర్తి సహాయకుడిగా వచ్చి, అనతి కాలంలోనే శిఖర స్థాయికి చేరుకున్నారని కొనియాడారు. తమ ఇద్దరి కలయికలో ఎన్నో పాటలు ప్రాణం పోసుకున్నాయని చెప్పారు. ఆయన పాటల పదముద్రలు తన హార్మోనియం మెట్లపై నాట్యం చేశాయని తెలిపారు. సినిమా పాటల్లో సైతం కవితాత్మని, కళాత్మకతని అందించి తనదైన ముద్రతో అర్థవంతమైన, సమర్థవంతమైన పాటలను అందించారని చెప్పారు.

సిరివెన్నెల సాహిత్యం తనతో ఆనంద తాండవం చేయించిందని ఇళయరాజా అన్నారు. వేటూరి తనకు తెలుగు సాహిత్యం మీద ప్రేమను పెంచితే... సీతారామశాస్త్రి తనకు తెలుగు సాహిత్యం మీద గౌరవాన్ని పెంచారని చెప్పారు. సిరివెన్నెల ఇంత త్వరగా శివైక్యం చెందడం బాధగా ఉందని అన్నారు. పాటకోసమే బ్రతికావని, బ్రతికినంత కాలం పాటలే రాశావని... నీకు ఈశ్వరుడు సద్గతిని ప్రసాదించాలని కోరుకుంటున్నానని చెప్పారు.

More Telugu News