Uttar Pradesh: ఆస్తి కోసం కుమారుడి పట్టు.. తిక్కరేగి రూ. 2.5 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి రాసిచ్చేసిన తండ్రి!

  • ఆస్తి కోసం పట్టుబడుతున్న కుమారుడు
  • వ్యాపారంపై దృష్టిపెట్టాలన్న తండ్రి
  • తండ్రిని పట్టించుకోవడం మానేసిన తనయుడు
  • తన ఆస్తిని మేజిస్ట్రేట్‌కు బదలాయించిన వృద్ధుడు
  • ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్న కలెక్టర్
Angry with son man wills his property worth nearly Rs 3 crore to state

ఒడిశాకు చెందిన ఓ మహిళ ఇటీవల తన ఆస్తి మొత్తాన్ని ఓ రిక్షా కార్మికుడికి రాసిచ్చేసి వార్తల్లోకి ఎక్కారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది. కుమారుడితో విభేదాల కారణంగా 83 ఏళ్ల తండ్రి తన రూ. 2.5 కోట్ల స్థిరాస్తిని రాష్ట్ర ప్రభుత్వానికి రాసిచ్చేశారు.

సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆగ్రాకు చెందిన గణేశ్ శంకర్ పాండే పొగాకు వ్యాపారి. ఆయన పెద్ద కుమారుడు దిగ్విజయ్.. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రితోనే ఉంటున్నారు.

ఈ క్రమంలో ఆస్తిని తన పేర రాయాలంటూ రోజూ వేధింపులకు గురిచేసేవాడు. తండ్రిని ఎప్పుడూ గౌరవించకపోగా, ఆస్తి తన పేర రాసివ్వాలంటూ ఇబ్బంది పెట్టేవాడు. ఆస్తి సంగతిని పక్కనపెట్టి ఏళ్ల తరబడి తాను కష్టపడి అభివృద్ధి చేసిన వ్యాపారంపై దృష్టి సారించాలని గణేశ్ పాండే కుమారుడికి హితవు పలికారు. అయితే, అతడు ఆ విషయాన్ని పక్కనపెట్టి ఆస్తిని దక్కించుకునేందుకు ప్రయత్నించాడు. కుమారుడి తీరుపై కలత చెందిన గణేశ్ పాండే తన ఆస్తి మొత్తాన్ని జిల్లా కలెక్టర్‌కు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆస్తిని ప్రభుత్వం పేర రాయించి అందుకు సంబంధించిన పత్రాలను నగర కలెక్టర్ ప్రతిపాల్ సింగ్‌కు అప్పగించారు.

తాను మరణించిన తర్వాత ఈ ఆస్తిని ప్రభుత్వం వినియోగించుకోవాలని ఆ పత్రాల్లో పేర్కొన్నారు. తాను జీవించడానికి అవసరమైన ధనం తన వద్ద ఉందని పేర్కొన్నారు. గణేశ్ శంకర్ పాండే తన ముగ్గురు తమ్ముళ్లతో కలిసి 1983లో 1000 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. అందులో నలుగురూ కలిసి ఇల్లు కట్టుకున్నారు. అందరూ కలిసి అదే ఇంట్లో ఉండేవారు. ఆ తర్వాత కొన్నాళ్లకు పరస్పర అంగీకారంతో ఆస్తిని నాలుగు భాగాలుగా విభజించారు.

ప్రస్తుత ధర ప్రకారం ఈ ఆస్తి విలువ కోట్లలో ఉంటుందని కలెక్టర్ ప్రతిపాల్ సింగ్ తెలిపారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ప్రభు ఎన్.సింగ్ మాట్లాడుతూ.. ఈ విషయమై గణేశ్  పాండేతో చర్చిస్తామన్నారు. ఆయనకు సాయం చేస్తామని చెప్పారు. గణేశ్ కనుక ఫిర్యాదు చేస్తే తల్లిదండ్రులు, సీనియర్ సిటిజెన్స్ చట్టం కింద అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

More Telugu News