Super Strain: ఒకే కరోనా వేరియంట్ లో 32 ఉత్పరివర్తనాలు... మూడు దేశాల్లో 'సూపర్ స్ట్రెయిన్'

  • దక్షిణాఫ్రికా, బోట్సువానా, హాంకాంగ్ లో కొత్త వేరియంట్
  • బి.1.1 నుంచి రూపాంతరం!
  • జన్యుక్రమాన్ని పరిశీలించిన పరిశోధకులు
  • ఆందోళన వ్యక్తం చేసిన వైనం
Super Strain emerged in three countries

కరోనా వైరస్ రెండేళ్ల కిందట చైనాలో వెలుగు చూసినప్పటికీ ఇప్పటికీ అనేక వేరియంట్లుగా విస్తరించింది. కొన్ని వేరియంట్లలో ఒకట్రెండు ఉత్పరివర్తనాలు చోటుచేసుకోవడం సాధారణమైన విషయం. తాజాగా దక్షిణ ఆఫ్రికా, బోట్సువానా, హాంకాంగ్ లో వెలుగు చూసిన ఓ కొత్త వేరియంట్ లో ఏకంగా 32 ఉత్పరివర్తనాలను గుర్తించారు. ఇన్ని మ్యుటేషన్లు ఉన్న ఈ సూపర్ స్ట్రెయిన్ ను ఇప్పుడున్న వ్యాక్సిన్లు ఏమేరకు అడ్డుకుంటాయన్నది శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది.

గతంలో పలు దేశాల్లో విస్తృతంగా వ్యాపించిన బి.1.1 కరోనా వేరియంట్ నుంచి ఈ కొత్త వేరియంట్ రూపాంతరం చెంది ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు కొత్త వేరియంట్ కారణంగా నమోదైన కేసులు 10 మాత్రమే. కానీ దీంట్లో భీతిగొలిపే రీతిలో ఉన్న జన్యు ఉత్పరివర్తనాల రీత్యా మున్ముందు మరిన్ని కేసులు వెల్లడవుతాయని, ఇప్పటికే వెలుగులోకి రాని కేసులు చాలా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా హాంకాంగ్ లో ఈ వేరియంట్ ఆనవాళ్లు బయటపడ్డాయి. తద్వారా ఈ వేరియంట్ ఏ ప్రాంతంలో అయినా మనుగడ సాగించగలదని అర్థమవుతోంది. దీనిపై లండన్ ఇంపీరియల్ కాలేజ్ కి చెందిన వైరాలజీ నిపుణుడు డాక్టర్ టామ్ పీకాక్ స్పందిస్తూ, ఒకే వేరియంట్ లో రెండు ప్రధాన ఉత్పరివర్తనాలు కనిపించడం తాను మొదటిసారి చూస్తున్నానని వెల్లడించారు. ఈ కొత్త కరోనా రకంలో కనిపస్తున్న జన్యు ఉత్పరివర్తన క్రమం నిజంగా బీభత్సకరంగా ఉందని పేర్కొన్నారు.

ఆసియా దేశాలకు ఈ వేరియంట్ వ్యాపించడం అంటే ఆయా దేశాల జనాభా రీత్యా మరింతగా విస్తరిస్తుందని అంచనా వేశారు. దీంట్లోని స్పైక్ మ్యుటేషన్ల అమరికను పరిశీలిస్తే ఇది మానవదేహంలోని మోనోక్లోనల్ యాంటీబాడీలను సులభంగా ఏమార్చగలదని డాక్టర్ టామ్ పీకాక్ వివరించారు.

More Telugu News