USA: రష్యాతో ఎస్ 400 మిసైళ్ల ఒప్పందం.. ఆంక్షల నుంచి భారత్ కు మినహాయింపేమీ లేదన్న అమెరికా

  • భారత్ వ్యూహాత్మక భాగస్వామి అన్న ఆ దేశ విదేశాంగ శాఖ
  • క్యాట్సా చట్టం గురించి భాగస్వామ్య దేశాలకు ముందే చెప్పాం
  • గత చర్చల్లో వాటి కొనుగోళ్లపై ఆందోళన వ్యక్తం చేశామని కామెంట్
US Says India Has No Special Waiver On S 400 Missile Deal with Russia

రష్యాతో భారత్ ఎస్ 400 క్షిపణుల ఒప్పందంపై అమెరికా ఆంక్షలకు సిద్ధమవుతోందా? అంటే.. పెడతామనికానీ, పెట్టబోం అనికానీ అమెరికా చెప్పలేదు. భారత్ పై కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ (క్యాట్సా) ప్రకారం ఆంక్షలు విధించబోమని ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేసింది. ఎస్ 400 మిసైళ్లు భారత్ కు అందుతుండడం, భారత్ పై ఆంక్షలు విధించవద్దంటూ ఇటు అధికార డెమొక్రాట్లు, అటు ప్రతిపక్ష రిపబ్లికన్లు డిమాండ్ చేస్తుండడంతో అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది.

భారత్ తో తమకు వ్యూహాత్మక భాగస్వామ్యం ఎప్పుడూ ముఖ్యమేనని, అయితే, క్యాట్సా ప్రకారం ఏ దేశానికీ మినహాయింపు ఉండదని విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు. రష్యాతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోవద్దంటూ భారత్ సహా తమ భాగస్వామ్య దేశాలకు ముందే చెప్పామని, చేసుకుంటే క్యాట్సా ఆంక్షలు తప్పవని హెచ్చరించామని తెలిపారు. భారత్ విషయంలో ఆంక్షల సడలింపు కుదరదని చెప్పారు.

భారత్ తో తమకు రక్షణ భాగస్వామ్యం అవసరమని, అందుకు అనుగుణంగా ఆ దేశంతో ఉన్న వ్యూహాత్మక బంధానికి విలువనిస్తామని పేర్కొన్నారు. గత ఆగస్టులో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తోనూ చర్చలు జరిపామని, తమ ఆందోళనలను వ్యక్తీకరించామని తెలిపారు. భారత్ కు ప్రస్తుతం ఎస్ 400 మిసైళ్లు అందినా.. అందకున్నా తమ చట్టాల గురించి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛకు సంబంధించి భారత్ తో బంధం అవసరమని, దానిపై చర్చలు కొనసాగుతూనే ఉంటాయని అన్నారు. రాబోయే కొన్ని రోజుల్లో వాషింగ్టన్ లో రెండు దేశాల విదేశాంగ మంత్రులు, రక్షణ మంత్రులతో చర్చలు ఉంటాయని ఆయన చెప్పారు.

More Telugu News