Taliban: అతివలు లేకుండా టీవీ సీరియళ్లు.... తాలిబన్ల హుకుం

  • ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల పాలన
  • పాత రోజులను గుర్తుకుతెస్తున్న తాలిబన్లు
  • కొత్త నిషేధాజ్ఞలు విధించిన వైనం
  • పురుషులు సైతం నిండుగా దుస్తులు ధరించాలని ఆదేశం
Taliban bans women to appear in TV dramas

టీవీ సీరియళ్లలో అత్యధికంగా కనిపించేది నటీమణులే. ప్రధానంగా మహిళా ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకునే టీవీ సీరియళ్లు నిర్మిస్తుంటారు. భారత్ లోనే కాదు అనేక దేశాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడైనా ఇది చెల్లుతుందేమో కానీ, తమ గడ్డపై చెల్లదని తాలిబన్లు అంటున్నారు. ఇకపై ఆఫ్ఘనిస్థాన్ టీవీ చానళ్లలో వచ్చే సీరియళ్లలో మహిళలు కనిపించరాదని తాజాగా హుకుం జారీ చేశారు. వార్తా చానళ్లలో పనిచేసే మహిళా పాత్రికేయులు, న్యూస్ ప్రెజెంటర్లు సంప్రదాయ బద్ధంగా తలను కూడా కప్పేసేలా దుస్తులు ధరించాలని ఆదేశించారు.

అమెరికా బలగాలు ఆఫ్ఘన్ గడ్డపై నుంచి నిష్క్రమించాక తాలిబన్లు పౌర ప్రభుత్వాన్ని కూల్చివేసి అధికారాన్ని తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. అప్పటి నుంచి క్రమంగా తమ నిజస్వరూపాన్ని చాటుకుంటున్నారు. మహిళలు టీవీ సీరియళ్లలో నటించడంపైనే కాదు, సినిమాల్లో కనిపించడంపైనా తాజాగా నిషేధం విధించారు.

మహిళలు వినోద వస్తువుల్లా బహిరంగ వేదికలపై కనిపించడం ఇస్లామిక్ షరియా చట్టానికి విరుద్ధమని తాలిబన్లు భావిస్తున్నారు. అంతేకాకుండా, టీవీల్లో కనిపించే పురుషులు సైతం నిండుగా దుస్తులు ధరించాలని, కామెడీ, ఇతర వినోద కార్యక్రమాలు మతాన్ని కించపర్చేవిగా ఉండరాదని స్పష్టం చేశారు. పాశ్చాత్య సంస్కృతిని ప్రచారం చేసే విదేశీ చిత్రాలను ప్రసారం చేయరాదని ఆదేశించారు.

More Telugu News