Tamil Nadu: భారీ వర్షాలకు తలదాచుకునేందుకు బంధువుల ఇంటికి వస్తే.. భవనం కూలి 9 మంది మృతి

  • వేలూరులోని పేర్నాంబట్టులో ఘటన
  • భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం
  • మృతుల్లో నలుగురు చిన్నారులు
  • మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం
9 dead in Tamil Nadu as building collapse due to rains

తమిళనాడులోని వేలూరు జిల్లా పేర్నాంబట్టులో విషాదం నెలకొంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నానిపోయిన ఓ భవనం నిన్న ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. విస్తృతంగా కురుస్తున్న వర్షాలకు పేర్నాంబట్టులోని నివాసాల చుట్టూ నీరు చేరింది. దీంతో స్థానిక మసీదులు, పాఠశాలల్లో ప్రజలు తలదాచుకుంటున్నారు.

మూడు కుటుంబాలు బంధువుల ఇంటిలో తలదాచుకున్నాయి. ఈ క్రమంలో నిన్న ఉదయం ఆ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 8 ఏళ్ల లోపు నలుగురు చిన్నారులు సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వీరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున తమిళనాడు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.

More Telugu News