Ambati Rambabu: అమ్మా... మిమ్మల్ని మేం ఏమీ అనలేదమ్మా: నారా భువనేశ్వరికి అంబటి రాంబాబు వివరణ 

  • అసెంబ్లీలో సంచలన పరిణామాలు
  • తన భార్యను కించపరిచారన్న చంద్రబాబు
  • మళ్లీ సీఎం అయిన తర్వాతే అసెంబ్లీకి వస్తానని శపథం
  • సానుభూతి కోసమే చంద్రబాబు ప్రయత్నమన్న  అంబటి
Ambati Rambabu gives explanation to Nara Bhuvaneswari

నేటి అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ నేతలు తన భార్య భువనేశ్వరి పట్ల అవమానకర రీతిలో మాట్లాడారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు.

"భువనేశ్వరి గారికి నమస్కరించి చెబుతున్నాం... అమ్మా, మిమ్మల్ని మేం ఏమీ అనలేదమ్మా! మాది మహిళలను కించపరిచే స్వభావం కూడా కాదు. చంద్రబాబు మీ నాన్న గారిని అడ్డంపెట్టుకుని రాజకీయాల్లో ఎదిగి, మీ నాన్న గారికి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవాళ మిమ్మల్ని అడ్డంపెట్టుకుని సానుభూతి పొందాలని ప్రయత్నిస్తున్నారు" అంటూ వ్యాఖ్యానించారు.

అంతేకాదు... చంద్రబాబునాయుడు ఇవాళ ఏడ్చాడా? మీరు నమ్మారా? అంటూ అంబటి రాంబాబు మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో అనేక కుటుంబాలను ఏడ్పించిన వ్యక్తి చంద్రబాబు... ఆయన ఏడవడం ఏంటి? అంటూ విస్మయం వ్యక్తం చేశారు.

"ఇదొక అద్భుతమైన నటన తప్ప మరొకటి కాదు. భువనేశ్వరి గారికి మీడియా ద్వారా మనవి చేసేది ఒక్కటే... మా పార్టీ వాళ్లు ఎవరూ మిమ్మల్ని ఏమీ అనలేదు. మేం మిమ్మల్ని ఏదో అన్నట్టుగా చిత్రీకరించి, సానుభూతి సంపాదించి ఏదో అవ్వాలనే ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. అంతేతప్ప ఇది వాస్తవం కాదు.

ఇవాళ అసెంబ్లీ సమావేశాలను నేను దగ్గర్నుంచి చూశాను. స్పీకర్ గురించి చంద్రబాబే నోటికొచ్చినట్టు మాట్లాడారు. స్పీకర్ టీడీపీ నుంచే వచ్చాడని, స్పీకర్ కు భిక్ష పెట్టామని ఏవేవో అన్నారు. ఫ్రస్ట్రేషన్ లో ఉన్న చంద్రబాబే ఇవాళ అసెంబ్లీలో తీవ్రస్థాయిలో మాట్లాడారు. చంద్రబాబు ఇక మూటాముల్లె సర్దుకోక తప్పదని కుప్పం వంటి తాజా పరిణామాలు చెబుతుండడంతో అసహనాన్ని భరించలేకపోతున్నారు.

సీఎం అయిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెడతానని చెప్పి, మీడియా ముందేమో నాకే పదవులు వద్దు అంటున్నాడు. కానీ చంద్రబాబుకు పదవే ముఖ్యం. పదవి కోసం ఎన్నో ఘోరాలు చేసిన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీ రామారావును, తోడల్లుడ్ని, బావమరుదులను పక్కకు నెట్టిన వ్యక్తి చంద్రబాబు.

రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతోంది. అన్ని వర్గాలు జగన్ వెంటే ఉన్నారు. జగన్ సంక్షేమ పథకాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రజలు మళ్లీ జగన్ వైపే నిలుస్తారన్న నేపథ్యంలో చంద్రబాబు దుర్మార్గ రాజకీయాలు చేస్తున్నారు. మరోసారి చెబుతున్నాం... ఎన్టీ రామారావు గారి కుమార్తె, చంద్రబాబు అర్ధాంగి అయిన భువనేశ్వరి గారిని మేం ఒక్క మాట కూడా అనలేదు. ఒకవేళ మేం అని ఉంటే ఆ మాట ఏంటో చూపించండి" అంటూ అంబటి రాంబాబు సవాల్ విసిరారు.

More Telugu News