Tirupati: తిరుపతి ప్రమాదకర పరిస్థితిలో ఉంది... ప్రజలు బయటికి రావొద్దు: అర్బన్ ఎస్పీ

  • జలదిగ్బంధంలో తిరుపతి
  • గత రెండ్రోజులుగా కుండపోత
  • లోతట్టు ప్రాంతాలు జలమయం
  • వర్షానికి తోడు ఈదురుగాలులు
  • నేలకొరిగిన చెట్లు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Tirupari Urban SP warns people about heavy rains

తిరుపతి నగరం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎటు చూసినా వరదనీరు పోటెత్తుతోంది. అలిపిరిలోనూ వరద పరిస్థితులు ఏర్పడ్డాయంటే ఏ స్థాయిలో వర్షం కురిసిందో అర్థంచేసుకోవచ్చు. నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఈదురుగాలులకు చెట్లు కూలిపోయాయి. దాంతో తిరుపతి నగరం అంధకారంలో మునిగిపోయింది. ఇంటర్నెట్ సేవలు కూడా నిలిచిపోయాయి. రోడ్లపై ప్రవహిస్తున్న వరదకు కార్లు, బైకులు మునిగిపోయాయి.

దీనిపై అర్బన్ ఎస్పీ అప్పలనాయుడు స్పందించారు. తిరుపతిలో పరిస్థితి ప్రమాదకరంగా ఉందని అన్నారు. ఎంతో ముఖ్యమైన పని ఉంటే తప్ప ప్రజలు ఎవరూ బయటికి రావొద్దని స్పష్టం చేశారు. తిరుపతి నుంచి నెల్లూరు, చెన్నై వైపు వెళ్లేవారు పుత్తూరు, నాగలాపురం, సత్యవేడు, తడ మీదుగా వెళ్లాలని సూచించారు. తిరుపతి నుంచి కడప వైపు వెళ్లేవారు 150 బైపాస్, పూతలపట్టు, పీలేరు, రాయచోటి మీదుగా వెళ్లాలని తెలిపారు.

కాగా, భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు సహాయం కోసం 0877-2256766 నెంబరును సంప్రదించాలని తిరుపతి మున్సిపల్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. అటు, తిరుమల ఘాట్ రోడ్డుపై 13 చోట్ల కొండచరియలు విరిగిపడడంతో టీటీడీ కనుమదారులను మూసివేసింది.

అంతేకాదు, ప్రతికూల వాతావరణంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాదు-తిరుపతి ఇండిగో విమానం వాతావరణం సహకరించకపోవడంతో నెల్లూరు-కావలి మధ్య గంటన్నరపాటు చక్కర్లు కొట్టింది. హైదరాబాద్ నుంచి వచ్చిన మరో విమానం ల్యాండింగ్ కు అనుమతించకపోవడంతో నల్లమలపై చక్కర్లు కొట్టింది.

More Telugu News