Tirumala: తిరుమలలో ఎడతెరిపి లేని వర్షం... ఘాట్ రోడ్లపై విరిగిపడిన కొండచరియలు

  • బంగాళాఖాతంలో వాయుగుండం
  • దక్షిణ కోస్తా, రాయలసీమలో విస్తారంగా వర్షాలు
  • తిరుమల కొండపై భారీ వర్షాలు
  • రెండు కనుమదారుల మూసివేత
  • నడకదారులు రెండ్రోజులు మూసివేసిన టీటీడీ 
Heavy rain caused landslides in Tirumala

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొనసాగుతోంది. దీని ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి తిరుమాడ వీధులు జలమయం అయ్యాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో సెల్లార్లలోకి నీరు చేరడంతో భక్తులు ఇబ్బందికి గురయ్యారు. అటు, కనుమదారులు, మెట్ల మార్గంపై భారీగా వర్షపు నీరు ప్రవహిస్తోంది. కనుమదారుల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దాంతో కనుమదారులను మూసివేశారు.

ముఖ్యంగా, రెండో కనుమదారి ప్రమాదకరంగా మారింది. పెద్ద బండరాళ్లు రోడ్డుపై పడడంతో వాహనాలు నిలిచిపోయాయి. ఈ కనుమ రహదారిపై పలు చెట్లు కూడా కూలిపోయాయి. ఈ నేపథ్యంలో రహదారులపై పడిన రాళ్లు, మట్టి తొలగించి రాకపోకల పునరుద్ధరణకు టీటీడీ ముమ్మరంగా శ్రమిస్తోంది. అటు, భారీ వర్షం కారణంగా టీటీడీ పాపవినాశనం రహదారిని కూడా మూసివేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెండ్రోజుల పాటు అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలను మూసివేస్తున్నట్టు టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఇక, నెల్లూరు జిల్లాలోనూ భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండడంతో కైవల్యా నది తీవ్రరూపు దాల్చింది. వెంకటగిరిలో రహదారిపైకి నది పొంగి ప్రవహిస్తుండడంతో వాహనాలను నిలిపివేశారు. అటు జిల్లాలోని గూడూరు వద్ద పంబలేరుకు కూడా వరద పోటెత్తింది. కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలోనూ అధిక వర్షపాతం నమోదైంది.

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కల్యాణి డ్యామ్ వద్ద నీటిమట్టం పూర్తిస్థాయికి చేరింది. దాంతో ఈ జలాశయం గేట్లు ఎత్తి 1200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. 2015 తర్వాత కల్యాణి డ్యామ్ నీటిమట్టం పూర్తిస్థాయికి చేరడం ఇదే ప్రథమం. సోమల మండలంలో వాగులు పొంగుతుండడంతో 57 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. అటు ఏర్పేడులో జంగాలపల్లె చెరువుకు గండిపడింది. కేవీబీ పురంలో కాళంగి జలాశయం గేట్లు ఎత్తివేశారు. 7,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

More Telugu News