Asaduddin Owaisi: కంగనా రనౌత్ పై అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శలు

  • 2014లో మన స్వాతంత్ర్యం వచ్చిందని కంగన చెప్పారంటూ ఒవైసీ ఎద్దేవా
  • ఆమెపై దేశద్రోహం కేసు పెడతారా? అని ప్రశ్న
  • స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందో మోదీ, యోగి చెప్పాలని డిమాండ్
Asaduddin Owaisi fires on Kangana Ranaut

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన హీరోయిన్ కంగనా రనౌత్ ఎప్పుడూ ఏదో ఒక వివాదం ద్వారా హెడ్ లైన్లలో నిలుస్తుంటారు. ఇటీవల ఏకంగా భారత స్వాతంత్ర్యంపై అనుచిత వ్యాఖ్యలు చేసి అందరి నుంచి ఆమె విమర్శలకు గురవుతున్నారు.

1947లో మనకు వచ్చింది నిజమైన స్వాతంత్ర్యం కాదని... 2014లో మోదీ ప్రధాని అయిన తర్వాతే మనకు అసలైన స్వాతంత్ర్యం వచ్చిందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదాన్నే రేపాయి. తాను చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పి, పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేయాలని ఎంతో మంది డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కంగనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా మండిపడ్డారు. మన దేశ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న ఒక మేడమ్ మనకు 2014లో స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారని ఎద్దేవా చేశారు. ఇదే వ్యాఖ్యలు ఒక ముస్లిం చేసి ఉంటే... ఇప్పటికే దేశద్రోహం కేసు పెట్టి, మోకాళ్లపై కాల్పులు జరిపి, ఆ తర్వాత జైలుకు పంపేవారని అన్నారు. ఆమె ఒక రాణి అని వ్యాఖ్యానించారు. మీరు (యోగి ఆదిత్యనాథ్) రాజు అయినప్పటికీ ఆమెను ఏమీ చేయరని విమర్శించారు.

టీ20 మ్యాచ్ లో భారత్ పై పాకిస్థాన్ గెలుపొందిన తర్వాత సంబరాలు చేసుకున్న వారిపై దేశద్రోహం కేసులు పెట్టారని... మరి ఇప్పుడు కంగనపై కూడా అవే కేసులు నమోదు చేస్తారా? అని అసదుద్దీన్ ప్రశ్నించారు. విద్రోహం కేసులను కేవలం ముస్లింలపైన మాత్రమే పెడతారా? అని అడిగారు. ఇంతకూ మనకు స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు.

More Telugu News