Joe Biden: అమెరికా అధ్యక్షుడు బైడెన్-కమలా హారిస్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయా?

  • శ్వేతసౌధ వర్గాలను ఉటంకిస్తూ ‘డెయిలీ మెయిల్’ కథనం
  • కమల తీరుపై బైడెన్ బృందం.. బైడెన్ తీరుపై కమల బృందం గుస్సా
  • పడిపోతున్న కమల, బైడెన్ రేటింగ్స్
  • అలాంటిదేమీ లేదన్న శ్వేతసౌధం
 Ties Between Joe Bidens and Kamala Harris are in crisis

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయా? వారి మధ్య స్నేహపూర్వక వాతావరణం లేదా? కీలక విషయాల్లో కమలను పక్కనపెట్టేస్తున్నందుకు ఆమె సిబ్బంది ఆగ్రహంతో ఉన్నారా? అమెరికన్లతో హారిస్ వ్యవహరిస్తున్న తీరుపై అధ్యక్షుడి బృందం ఆగ్రహంతో ఉందా? ఈ ప్రశ్నలకు అవుననే అంటోంది ‘డెయిలీ మెయిల్’. తాజాగా ప్రచురించిన సంచలన కథనంలో పలు విషయాలను ప్రస్తావించింది.

ఇటీవలి కాలంలో బైడెన్‌తో పోలిస్తే కమల రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయని పేర్కొంది. మరోవైపు, కొత్త ఉపాధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు బ్యాక్‌డోర్ పద్ధతిగా ఆమెను సుప్రీంకోర్టుకు నియమించడాన్ని బైడెన్ తీవ్రంగా పరిగణిస్తున్నట్టు కూడా ఇటీవల ప్రచారం జరిగింది. ‘సరిహద్దు సంక్షోభం’ వంటి ఎడతెగని సమస్యలను హారిస్‌కు అప్పగించినందుకు ఆమెతోపాటు ఆమె సహాయకులు కూడా బైడెన్‌పై కొంత విసుగ్గా ఉన్నారని శ్వేతసౌధ వర్గాలను ఉంటంకిస్తూ సీఎన్ఎన్ పేర్కొంది.

ఉపాధ్యక్షురాలైన హారిస్ కంటే శ్వేతజాతీయుడైన రవాణాశాఖ కార్యదర్శి పీట్ బుట్టిగీగ్‌కు బైడెన్ వత్తాసు పలుకుతుండడాన్ని ఈ సందర్భంగా ఉదహరించింది. దీనికి తోడు ఎన్‌బీసీ లెస్టర్ హోల్ట్ సరిహద్దును సందర్శించడంపై అడిగిన ప్రశ్నకు కమల ‘విచిత్రంగా’ నవ్వి స్వీయ వివాదానికి తెరతీయడంపైనా బైడెన్ సిబ్బంది కొంత నిరాశగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇదిలావుంచితే, ఇటీవల కాలంలో బైడెన్ ప్రాభవం కొంత తగ్గుతున్నట్టుగా కనిపిస్తోంది. అమెరికన్లు ఆయనపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చలేకపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏబీసీ న్యూస్/వాషింగ్టన్ పోస్ట్ పోల్ సర్వేలో బైడెన్ పోల్ నంబర్లు దిగజారాయి. ఏప్రిల్‌తో పోలిస్తే బైడెన్ అప్రూవల్ రేటు గణనీయంగా పడిపోయింది. 53 శాతం మంది బైడెన్‌కు వ్యతిరేకంగా ఓటేయగా, 41 శాతం మంది మాత్రమే సమ్మతి తెలిపారు. ఏప్రిల్‌తో పోలిస్తే 11 పాయింట్లు తగ్గిపోయాయి.

కాగా, బైడెన్, కమలా హరిస్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్టు వస్తున్న వార్తలపై శ్వేతసౌధం స్పందించింది. అలాంటిదేమీ లేదని ఖండించింది. వారి మధ్య సామరస్య పూర్వక వాతావరణం ఉందని స్పష్టం చేసింది. సాధారణంగా ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్‌ తదుపరి పార్టీ ఓపెన్ ఫీల్డ్ ప్రెసిడెన్షియల్ ప్రైమరీకి ఆటోమెటిక్‌గా పరిగణింపబడతారు. 80 ఏళ్ల వయసున్న బైడెన్ కనుక మళ్లీ ఎన్నికలకు వెళ్లకూడదనుకుంటే కనుక 2024 ఎన్నికల్లో కమలా హారిస్‌ డెమోక్రాట్ల తరపున అధ్యక్ష బరిలో నిలిచే అవకాశం ఉంది.

More Telugu News